వ్యాన్ బోల్తా
20 మందికి గాయాలు
- ఆసిఫాబాద్‌లో ప్రమాదం
- బారసాలకు వస్తుండగా ఘటన
- బాధితుల్లో మహిళలే అధికం
- క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులు
ఆసిఫాబాద్/మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా భారీ గ్రామానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. భారీ గ్రామానికి చెందిన 40 మంది బంధువులు ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామానికి చెందిన నాగోశ గణపతి ఇంట్లో నిర్వహించనున్న బారసాల శుభకార్యానికి ఉదయం వ్యాన్‌లో బయలు దేరారు.
అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన వారు బీఎస్‌ఎన్‌ఎల్ టవర్స్ సమీపంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న శెండె తారాబాయి, ఊశన్‌కర్ తిరుపతి, శెండె గంగుబాయి, శెండె సుమిత్ర బాయి, పూర్ణె లక్ష్మి, శెండె అమ్మబాయి, శెండె రమలాబాయిలకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా, మొహర్లె పోతాబాయి, చోటాబాయి, విమలాబాయి, కమలాబాయి, తారాబాయి, సుకాజి, సోంబాయి, గౌరుబాయి, నాలుగేళ్ల చిన్నారి శ్వేతతోపాటు 20 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను 108 ద్వారా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. వైద్యులు సత్యనారాయణ, తిరుపతి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శాంతాబాయి, తిరుపతి, గంగుబాయి, సుమిత్ర బాయి, లక్ష్మిలను మంచిర్యాలకు తరలించారు. ఎస్సై రాంబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు.
బాధితులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, వాంకిడి జెడ్పీటీసీలు కొయ్యల హేమాజి, అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ తారాబాయి, టీఆర్‌ఎస్ నాయకులు గంధం శ్రీనివాస్, గాదెవేని మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్ల నారాయణ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. డ్రైవర్ సుభాష్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మిన్నంటిన రోదనలు
ఆసిఫాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వీరికి వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు అందజేశారు. ఇందులో గంగుబాయి, శాంతాబాయి, కమలాబాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా 13 మంది క్షతగాత్రుల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో దద్దరిల్లింది.