state highway
-
ఫలించిన ఎంపీ కృషి
మూడు రోడ్లకు జాతీయ స్థాయి – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రికి బుట్టా రేణుక కృతజ్ఞతలు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక రెండేళ్లుగా చేస్తున్న కృషి ఫలించింది. తన నియోజకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారులను జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఎంపీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ జయరాం గడ్కరీకి విన్నవిస్తూ వస్తున్నారు. ఈ మేరకు కర్నూలు నియోజకవర్గం గుండా వెళ్లే మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా స్థాయి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం ఎంపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి గడ్కారీకి ఎంపీ బుట్టా రేణుక కృతజ్ఙతలు తెలియజేశారు. జాతీయస్థాయికి అప్‌గ్రేడ్ అయిన రోడ్లు ఇవే.. 1) ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని గుత్తితో అనుసంధానమై ఉన్న పత్తికొండ, ఆదోని, మదిరే, హనవల్, కుంతనహాయ్, ఉప్పరహాల్, కౌతాళం, ఉరుకుంద, హాల్వి, కుంబాలనూరు, మాన్వి ప్రాంతాలు కలిపే రోడ్డు (ఏపీలో 135 కి.మీ., కర్ణాటకలో 15 కి.మీ.ల మేరకు) 2) కొత్తకోట, గూడూరు, మంత్రాలయంను కలిపే రోడ్డు 167వ జాతీయ రహదారిగా మార్పు కానుంది.(ఏపీ 22 కి.మీ., తెలంగాణాలో 70 కి.మీ.) 3) ఏపీలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద క్రాస్ అయ్యే 167వ జాతీయ రహదారి నుంచి కర్ణాటకలోని బళ్లారితో అనుసంధానం. (ఏపీలో 2 కి.మీ., కర్ణాటకలో 26 కి.మీ.) -
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు
బల్లికురవ : ముందు వెళుతున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మేదరమెట్ల-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో మండలంలోని వైదన గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీహరిరావు కథనం మేరకు కందకూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కేఎంబీటీ ట్రావెలర్స్బస్సు వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కందకూరుకు చెందిన పర్రె సంధ్య, ఆమె కుమారుడు వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు ముందు భాగంలో కూర్చోవడంతో గాయాల పాలయ్యారు. మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు. క్షతగాత్రులు నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమా దం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్డీవోనా.. ఐతేఏంటి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అక్రమాలను, అవకతవకలను అడ్డుకోవాలంటూ స్వయంగా ఉన్నతాధికారులు ఆదేశించినా కొంతమంది ఉద్యోగులు ఖాతరు చేయని పరిస్థితులు జిల్లాలో ఎక్కువవుతున్నాయి. ఎక్కడికక్కడ మామూళ్ల మత్తులో జోగుతున్న అక్రమార్కులు ఉన్నధికారులను సైతం లెక్కచేయకుండా వారి కళ్లకు గంతలు కట్టేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. పోలవరం సమీపంలోని ఇసుక ర్యాంపుల నుంచి బిల్లులు లేకుండా భారీ వాహనాల్లో ఇసుకను తరలించడం పరిపాటిగా మారింది. ఆ వాహనాలు దేవరపల్లి-తల్లాడ స్టేట్ హైవేపై వెళ్లాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండానే పక్కదారుల మీదుగా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. లక్షలాది రూపాయల విలువైన ఇసుక లోడుతో ఆయా వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్నా సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదలేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు జారీ చేసినా ఉద్యోగులు, కిందిస్థాయి అధికారులు లెక్కచేయడం లేదు. గత నెల 29వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గోపాలపురం రోడ్డుపై 12 టైర్ లారీ (టీఎస్-08 యూబీ 2287) ఇసుక లోడుతో వెళ్తుండటాన్ని స్వయంగా చూసిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. నిబంధనలను అతిక్రమించి వెళ్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. అయితే సదరు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు మాత్రం కనీస మాత్రంగా కూడా ఆర్డీవో ఆదేశాలను ఖాతరు చేయలేదు. పట్టుకున్న లారీని వదిలివేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా తరలివెళ్లిన ఆ లారీపై కేసు పెట్టేందుకు పోలీసులు కూడా సుముఖత చూపలేదు. ఇదేమిటని అడిగితే.. లారీ ఉంటే స్వాధీనం చేసుకుని కేసు పెడతాం గానీ లేకుండా కేసేంటని ఎదురు ప్రశ్నలు వేశారు. స్వయంగా ఆర్డీవో ఆదేశించినా పట్టుకున్న లారీని వదిలేసిన వ్యవహారంపై ఇప్పుడు పోలీస్, రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లారీ వదిలేశారా.. నాకు తెలియదే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడుతో వెళ్తున్న 12 టైర్ లారీని సీజ్ చేయాల్సిందిగా నేను ఆదేశించాను. ఆ వాహనాన్ని వదిలేసిన విషయం నాకు తెలియదు. ఎందుకు వదిలేశారో కనుక్కుంటా.. లారీ నెంబర్ ఉంది కాబట్టి ఈసారి వచ్చినప్పుడు పట్టుకుని డబుల్ ఫైన్ కట్టిస్తా. - ఎస్.లవన్న, ఆర్డీవో -
వ్యాన్ బోల్తా
20 మందికి గాయాలు - ఆసిఫాబాద్‌లో ప్రమాదం - బారసాలకు వస్తుండగా ఘటన - బాధితుల్లో మహిళలే అధికం - క్షతగాత్రులు మహారాష్ట్ర వాసులు ఆసిఫాబాద్/మంచిర్యాల టౌన్ : ఆసిఫాబాద్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలోని రాష్ట్రీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా భారీ గ్రామానికి చెందిన 20 మందికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. భారీ గ్రామానికి చెందిన 40 మంది బంధువులు ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామానికి చెందిన నాగోశ గణపతి ఇంట్లో నిర్వహించనున్న బారసాల శుభకార్యానికి ఉదయం వ్యాన్‌లో బయలు దేరారు. అరగంటలో గమ్యానికి చేరుకోవాల్సిన వారు బీఎస్ఎన్ఎల్ టవర్స్ సమీపంలో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న శెండె తారాబాయి, ఊశన్కర్ తిరుపతి, శెండె గంగుబాయి, శెండె సుమిత్ర బాయి, పూర్ణె లక్ష్మి, శెండె అమ్మబాయి, శెండె రమలాబాయిలకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా, మొహర్లె పోతాబాయి, చోటాబాయి, విమలాబాయి, కమలాబాయి, తారాబాయి, సుకాజి, సోంబాయి, గౌరుబాయి, నాలుగేళ్ల చిన్నారి శ్వేతతోపాటు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. వైద్యులు సత్యనారాయణ, తిరుపతి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శాంతాబాయి, తిరుపతి, గంగుబాయి, సుమిత్ర బాయి, లక్ష్మిలను మంచిర్యాలకు తరలించారు. ఎస్సై రాంబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, వాంకిడి జెడ్పీటీసీలు కొయ్యల హేమాజి, అరిగెల నాగేశ్వర్ రావు, ఎంపీపీ తారాబాయి, టీఆర్ఎస్ నాయకులు గంధం శ్రీనివాస్, గాదెవేని మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్ల నారాయణ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. డ్రైవర్ సుభాష్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మిన్నంటిన రోదనలు ఆసిఫాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 13 మంది క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వీరికి వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు అందజేశారు. ఇందులో గంగుబాయి, శాంతాబాయి, కమలాబాయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా 13 మంది క్షతగాత్రుల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలిరావడంతో ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో దద్దరిల్లింది.