సాక్షి ప్రతినిధి, ఏలూరు :అక్రమాలను, అవకతవకలను అడ్డుకోవాలంటూ స్వయంగా ఉన్నతాధికారులు ఆదేశించినా కొంతమంది ఉద్యోగులు ఖాతరు చేయని పరిస్థితులు జిల్లాలో ఎక్కువవుతున్నాయి. ఎక్కడికక్కడ మామూళ్ల మత్తులో జోగుతున్న అక్రమార్కులు ఉన్నధికారులను సైతం లెక్కచేయకుండా వారి కళ్లకు గంతలు కట్టేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. పోలవరం సమీపంలోని ఇసుక ర్యాంపుల నుంచి బిల్లులు లేకుండా భారీ వాహనాల్లో ఇసుకను తరలించడం పరిపాటిగా మారింది. ఆ వాహనాలు దేవరపల్లి-తల్లాడ స్టేట్ హైవేపై వెళ్లాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా వెళ్లిపోతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండానే పక్కదారుల మీదుగా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. లక్షలాది రూపాయల విలువైన ఇసుక లోడుతో ఆయా వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్నా సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదలేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు జారీ చేసినా ఉద్యోగులు, కిందిస్థాయి అధికారులు లెక్కచేయడం లేదు. గత నెల 29వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గోపాలపురం రోడ్డుపై 12 టైర్ లారీ (టీఎస్-08 యూబీ 2287) ఇసుక లోడుతో వెళ్తుండటాన్ని స్వయంగా చూసిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు.
నిబంధనలను అతిక్రమించి వెళ్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. అయితే సదరు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు మాత్రం కనీస మాత్రంగా కూడా ఆర్డీవో ఆదేశాలను ఖాతరు చేయలేదు. పట్టుకున్న లారీని వదిలివేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా తరలివెళ్లిన ఆ లారీపై కేసు పెట్టేందుకు పోలీసులు కూడా సుముఖత చూపలేదు. ఇదేమిటని అడిగితే.. లారీ ఉంటే స్వాధీనం చేసుకుని కేసు పెడతాం గానీ లేకుండా కేసేంటని ఎదురు ప్రశ్నలు వేశారు. స్వయంగా ఆర్డీవో ఆదేశించినా పట్టుకున్న లారీని వదిలేసిన వ్యవహారంపై ఇప్పుడు పోలీస్, రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
లారీ వదిలేశారా.. నాకు తెలియదే
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడుతో వెళ్తున్న 12 టైర్ లారీని సీజ్ చేయాల్సిందిగా నేను ఆదేశించాను. ఆ వాహనాన్ని వదిలేసిన విషయం నాకు తెలియదు. ఎందుకు వదిలేశారో కనుక్కుంటా.. లారీ నెంబర్ ఉంది కాబట్టి ఈసారి వచ్చినప్పుడు పట్టుకుని డబుల్ ఫైన్ కట్టిస్తా.
- ఎస్.లవన్న, ఆర్డీవో
ఆర్డీవోనా.. ఐతేఏంటి!
Published Thu, May 7 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement