సాక్షి, హైదరాబాద్ : మైండ్ స్పేస్‌లోని మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ టెకీకి కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. మైండ్ స్పేస్‌లో ఓ మహిళకు కరోనా వచ్చిందన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీ సజ్జనార్‌తోపాటు, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఐటీ కారిడర్ ఖాళీ కాలేదని, వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (చదవండి : తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు!)
23 మందికే వర్క్ ఫ్రమ్ హోమ్ : జయేష్ రంజన్
జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకిందని తెలిపారు. డీఎస్‌ఎమ్ ఉద్యోగికి కరోనా వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ టెకీ వైద్య పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉందని.. రేపు ఉదయం వరకు రిపోర్ట్ వస్తాయని అన్నారు. మైండ్ స్పేస్ అంతా ఖాళీ అవుంతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రేపటి నుంచి మైండ్ స్పేస్‌లోని కంపెనీలన్నీ యథాతథంగా నడుస్తాయని చెప్పారు. వైరస్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న మహిళ భర్తకు కంపెనీ ప్రతినిధులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో మరో రెండు కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చాయని అన్నారు.
అయితే కంపెనీలు ఖాళీ చేయాల్సిన అవరసరం లేదని ప్రభుత్వం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇచ్చేటప్పుడు ఐటీ, పరిశ్రమల శాఖకు తెలపాలని సూచించారు. తమ అనుమతి లేకుండా కంపెనీలు ఖాళీ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. డీఎస్‌ఎమ్ కంపెనీ ఒక్కరోజు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించదన్నారు. కేవలం 23 మందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారని తెలిపారు. సహచర ఉద్యోగులుకు కరోనా సోకిందనేది అవాస్తవం అన్నారు. (చదవండి : ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!)
ఉద్యోగులను విదేశాలకు పంపొద్దు : శ్రీనివాస్
శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంగళవారం 45 మందికి పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా వైరస్ నెగెటివ్‌గా తేలిందన్నారు. మరో ఇద్దరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలిన సికింద్రాబాద్ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ లేదని.. అయినప్పటికీ కేరళలో వైరస్ సోకిన వారి పరిస్థితి మెరుగైందని గుర్తుచేశారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదని తెలిపారు. కేవలం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నారు. చేతులను నిరంతం సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. వచ్చే రెండు నెలల వరకు ఐటీ ఉద్యోగులను విదేశాలకు పంపొద్దని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. కరోనా గురించి అనుమానాలు ఉంటే 104కు కాల్ చేయవచ్చని చెప్పారు.(చదవండి : 'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి')
Comments
Please login to add a commentAdd a comment