వెజి'ట్రబుల్‌!' | Vegetable Prices Rise in One Day After Janata Curfew Hyderabad | Sakshi
Sakshi News home page

వెజి'ట్రబుల్‌!'

Published Tue, Mar 24 2020 8:22 AM | Last Updated on Tue, Mar 24 2020 8:22 AM

Vegetable Prices Rise in One Day After Janata Curfew Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌తో కూరగాయల ధరలు ఒక్కరోజులోనే మూడింతలయ్యాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సోమవారం నగరంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు 46 శాతం కూరగాయల సరఫరా తగ్గింది. దీంతో పాటు గుడి మల్కాపూర్‌ మార్కెట్‌ శుభ్ర పర్చడానికి సోమవారం మూసివేశారు. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రూ.60 నుంచి రూ.80 మధ్య పలికాయి. జనతా కర్ఫ్యూ, నగర లాక్‌డౌన్‌కు ముందు కిలో రూ.10 పలికిన టమాటా సోమవారం రూ.80కి విక్రయించారు. అత్యధికంగా చిక్కుడు, బిన్సీస్‌ ధర రూ. 100 నుంచి రూ.120 వరకు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు విక్రయించారు. కరోనా ప్రభావంతో నగర జనం ఎక్కువ శాతం కూరగాయలను వినియోగిస్తున్నారు. దీంతో కూడా మామూలు రోజుల కంటే ఎక్కువగా కూరగాయలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు నగరం లాక్‌డౌన్‌తో కూడా నగర ప్రజలు అర కిలో, కిలో చోటా నాలుగు, ఐదు కిలో వివిధ రకాల కూరగాయలు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీంతోనూ దిగుమతి అయినా కూరగాయలు సరిపోకపోవడంతో వ్యాపారులు ధరలు ఒకేసారి పెంచేశారు. 

కూరగాయల డిమాండ్‌ ఇలా..
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర జనాహి దాదాపు కోటి మంది. వీరు ప్రతిరోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగిస్తుంటారు. ప్రతిఒక్కరికీ 300 గ్రాముల కూరగాయలు అవసరం. కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం నిత్యం  4 వేల టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని మార్కెటింగ్‌ శాఖ అధికారుల అంచనా. కానీ మార్కెట్‌లకు డిమాండ్‌కు తగ్గ కూరగాయలు సప్లయ్‌ లేకపోడంతో కూరగాయల కొరత నెలకొందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. సోమవారం బోయిన్‌పల్లి మార్కెట్‌కు దాదాపు 745 టన్నులు, ఎల్బీనగర్‌ మార్కెట్‌కు 11, మాదన్నపేట్‌ మార్కెట్‌కు 8, మీరాలంమండి మార్కెట్‌కు 6 టన్నుల కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో పాటు నగరంలోని 11 రైతు బజార్లను కలుపుకొని 110 టన్నులు, ఇతల చిన్నాచితకా మార్కెట్‌లకు 10 టన్నుల కూరగాయలు దిగుమతి అయినట్లు అంచనా. గ్రేటర్‌ కూరగాయల అవసరం ఒక్క రోజుకు 3 వేల నుంచి నాలుగు వేల టన్ను అయితే సోమవారం కేవలం వెయ్యి టన్ను కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో డిమాండ్‌ ఎక్కువ.. సప్లయ్‌ తక్కువ కావడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.

జాడలేని ప్రత్యామ్నాయం..
ఈ నెల 31 వరకు నగరంలో లాక్‌డౌన్‌ ఉండడంతో.. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా కూరగాయలు నగర మార్కెట్‌లకు దిగుమతి కావడంలేదు. కూరగాయల వినియోగం ప్రస్తుతం ఉన్నట్లు రానున్న రోజుల్లోనూ ఇలాగే ఉంటే ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుందో తెలియని పరిస్థితి నెలకొంది.

కోల్డ్‌ స్టోరేజీ ఒక్కటీ లేదు
గ్రేటర్‌లో ఒక్క కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో జనతా కర్ఫ్యూ, నగర లాక్‌డౌన్‌ లాంటి సందర్భంలో కూరగాయలు నిల్వ చేసి ఉంటే ధరలు అంతగా పెరిగేవి కావని వినియోగదారులు అంటున్నారు.  డిమాండ్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే కమీషన్‌ ఏజెంట్లు సిండికేట్‌గా మారి ధరలను అమాంతంగా పెంచారు. కూరగాయల దిగుమతులు తగ్గడంతో కమీషన్‌ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు  నిర్ణయించిన ధరలకు కూరగాయలు కొనాల్సి ఉంటుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు.      లాక్‌డౌన్‌తో కమీషన్‌ ఏజెంట్లు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.   

బహిరంగ మార్కెట్‌లో దోపిడీ..
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రజలకు భరోసా ఇచ్చి 24 గంటలు గడవక ముందే మార్కెట్‌లో వీటి ధరలు సాధారణ ప్రజానీకానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ఉప్పల్, కుషాయిగూడ, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయల ధరలు మండి పోయాయి. మార్కెట్లలోనే కాదు బయట బండి మీది కాయగూరలు అమ్మే వారు సైతం అమాంతంగా రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు.   

నేటి నుంచి ధరలు తగ్గుతాయి..
అదివారం జనతా కర్ఫ్యూ కారణంగా శుక్ర, శనివారాల్లో కూరగాయల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఆదివారం అన్ని మార్కెట్‌లు బంద్‌ పాటించాయి. సోమవారం లాక్‌డౌన్‌తో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు చాలావరకు తగ్గాయి. గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ శుభ్రపర్చడానికి సోమవారం మూసివేశాం. దీంతో కూరగాయల ధరలు పెరిగాయి. మంగళవారం నుంచి కూరగాయల దిగుమతులు పెరుగుతాయి. ధరలు తగ్గుతాయి. ధరలు నియత్రించడానికి మార్కెట్‌ శాఖ సిబ్బంది వ్యాపారులపై నిఘా పెట్టనున్నారు.   – జి.లక్ష్మీబాయి, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement