సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఎండలతోపాటే రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఎండల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడి కూరగాయల ధర లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్రీయంగా కూరగాయల దిగుబడులు తగ్గడం, బయటి రాష్ట్రాల నుంచి రావాల్సినంతగా దిగుమతి లేకపోవడం ధరలు అమాంతంగా పెరిగేందుకు కారణం. ఎండలు మరింత ముదిరిన పక్షంలో వచ్చే మూడు నెలల్లో ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది.
అన్నింటి ధరలూ పైపైకే..
రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లో 3లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగింది. అయితే సాగుకు తగినట్టు నీటి లభ్యత లేదు. ప్రస్తుత సీజన్‌లో చెరువులతో పాటు భూగర్భ జలాల్లో భారీ క్షీణత కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారానికే భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్ర సగటు భూగర్భ మట్టం మార్చి మొదటి వారానికి గత ఏడాది 11.91 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 12.53 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 1.56 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కూరగాయల సాగు అధికంగా జరిగే మెదక్‌లో 22.28 మీటర్లు, వికారాబాద్ 19.19 మీటర్లు, రంగారెడ్డిలో 17.32 మీటర్లు, సిద్దిపేటలో 18.92 మీటర్లకు నీటి మట్టాలు తగ్గాయి. ఈ ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఈ నేపథ్యంలో కిందటి నెల పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా తాజాగా హోల్‌సేల్ మా ర్కెట్లలోనే వీటి ధర రూ.50కి చేరింది. ఇక రిటైల్ వ్యాపారులు ఏకంగా కిలో రూ.70కి పెంచి అమ్ముతున్నారు. బెండ, దొండకాయల ధరలు గత నెలలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. బీన్స్‌ఏకంగా రూ.70 ఉండగా, చిక్కుడు రూ.60, గోరుచిక్కుడు రూ.45, క్యాప్సికం రూ.60, వంకాయ రూ.40 మేర పలుకుతోంది. క్యాలిఫ్లవర్, క్యాబేజీ ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి రోజూ వచ్చే కూరగాయలతో పోలిస్తే ప్రస్తుత దిగుమతులు సగానికి పడిపోయినట్టు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. నీటి సమస్యే ఇందుకు ప్రధాన కారణమని అంటోంది. నీటి కరువు కారణంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయాయి. ఇవి ప్రధానంగా బెండ, దొండ, క్యారెట్, క్యాబేజీ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. క్యాప్సికం కర్ణాటక, మహారాష్ట్రల నుంచే వస్తుండగా, వీటి దిగుమతులు 500 క్వింటాళ్ల నుంచి 300 క్వింటాళ్లకు తగ్గాయి. వంకాయ సైతం కేవలం 30 క్వింటాళ్ల మేరే దిగుమతి అవుతోంది. ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ లోటు వర్షపాతాలు నమోదు కావడం, అక్కడ కూరగాయల సాగుపై దీని ప్రభావం ఉండే అవకాశాల నేపథ్యంలో నిండు వేసవిలో ధరల పెరుగుదల మరింతగా ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎండలాగే మండుతున్నాయ్!
Published Tue, Mar 12 2019 2:42 AM | Last Updated on Tue, Mar 12 2019 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment