Sunny Intensity
-
రాష్ట్రంలో మూడు నెలలు తీవ్రమైన ఎండలు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్, మే, జూన్లలో రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారత వాతావరణ హెచ్చరికల కేంద్రం తాజా అంచనాలను బుధవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ హీట్ వేవ్ జోన్లో ఉందని హెచ్చరించింది. ప్రతి ప్రాంతంలో 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదు అవుతాయని హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్‌లో 40, కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇదిలా వుండగా బుధవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో 41 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మెదక్‌లో 40 డిగ్రీలు నమోదైందని ఆయన వెల్లడించారు. -
ఎండకూ లొంగని స్వైన్‌ఫ్లూ..
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వైరస్ ఎండ మంటకూ లొంగడం లేదు. సాధారణంగా చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 వైరస్... విచిత్రంగా ఎండలు దంచుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెల ఇప్పటివరకు ఏకంగా 573 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 12 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఈ నాలుగైదు రోజుల్లోనే 35 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతిచెందారు. చలికాలంలో విస్తృతిని పెంచుకునే వైరస్, ఎండలు మండుతున్నా తట్టుకుని ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 14,992 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 1,103 మంది చనిపోయారు. దారుణ విషయం ఏంటంటే.. ఈ ఏడాది రెండున్నర నెలల కాలంలోనే 20 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 605 మంది చనిపోయారు. గతేడాది నమోదైన కేసుల కంటే, ఈ రెండున్నర నెలల్లో నమోదైన కేసులు అధికంగా ఉండటం గమనార్హం. పైగా ఈ రెండున్నర నెలల్లో నెల మాత్రమే చలికాలం కాగా, మిగతాదంతా ఎండా కాలం. ఎన్నికలపై ప్రభావం... ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ప్రజలు గుంపులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇలా గుంపులుగా ఉన్నప్పుడే స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైరస్ మరింత సోకి కేసులు సంఖ్య పెరగవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఏమీ కాదన్న ధీమాతో ఉంటే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సి ఉంది. కాగా కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కనీసం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. -
ఎండలాగే మండుతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఎండలతోపాటే రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. రోజురోజుకీ తీవ్రమవుతున్న ఎండల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడి కూరగాయల ధర లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్రీయంగా కూరగాయల దిగుబడులు తగ్గడం, బయటి రాష్ట్రాల నుంచి రావాల్సినంతగా దిగుమతి లేకపోవడం ధరలు అమాంతంగా పెరిగేందుకు కారణం. ఎండలు మరింత ముదిరిన పక్షంలో వచ్చే మూడు నెలల్లో ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది. అన్నింటి ధరలూ పైపైకే.. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో 3లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరిగింది. అయితే సాగుకు తగినట్టు నీటి లభ్యత లేదు. ప్రస్తుత సీజన్లో చెరువులతో పాటు భూగర్భ జలాల్లో భారీ క్షీణత కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి మొదటి వారానికే భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్ర సగటు భూగర్భ మట్టం మార్చి మొదటి వారానికి గత ఏడాది 11.91 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 12.53 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 1.56 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా కూరగాయల సాగు అధికంగా జరిగే మెదక్‌లో 22.28 మీటర్లు, వికారాబాద్ 19.19 మీటర్లు, రంగారెడ్డిలో 17.32 మీటర్లు, సిద్దిపేటలో 18.92 మీటర్లకు నీటి మట్టాలు తగ్గాయి. ఈ ప్రభావం కూరగాయల సాగుపై పడింది. ఈ నేపథ్యంలో కిందటి నెల పచ్చిమిర్చి కిలో రూ.30 ఉండగా తాజాగా హోల్‌సేల్ మా ర్కెట్లలోనే వీటి ధర రూ.50కి చేరింది. ఇక రిటైల్ వ్యాపారులు ఏకంగా కిలో రూ.70కి పెంచి అమ్ముతున్నారు. బెండ, దొండకాయల ధరలు గత నెలలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 పలుకుతోంది. బీన్స్‌ఏకంగా రూ.70 ఉండగా, చిక్కుడు రూ.60, గోరుచిక్కుడు రూ.45, క్యాప్సికం రూ.60, వంకాయ రూ.40 మేర పలుకుతోంది. క్యాలిఫ్లవర్, క్యాబేజీ ధరల్లోనూ ఇదే తరహా పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి రోజూ వచ్చే కూరగాయలతో పోలిస్తే ప్రస్తుత దిగుమతులు సగానికి పడిపోయినట్టు మార్కెటింగ్ శాఖ చెబుతోంది. నీటి సమస్యే ఇందుకు ప్రధాన కారణమని అంటోంది. నీటి కరువు కారణంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే కూరగాయల దిగుమతులు భారీగా పడిపోయాయి. ఇవి ప్రధానంగా బెండ, దొండ, క్యారెట్, క్యాబేజీ ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. క్యాప్సికం కర్ణాటక, మహారాష్ట్రల నుంచే వస్తుండగా, వీటి దిగుమతులు 500 క్వింటాళ్ల నుంచి 300 క్వింటాళ్లకు తగ్గాయి. వంకాయ సైతం కేవలం 30 క్వింటాళ్ల మేరే దిగుమతి అవుతోంది. ఇతర కూరగాయలదీ ఇదే పరిస్థితి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ లోటు వర్షపాతాలు నమోదు కావడం, అక్కడ కూరగాయల సాగుపై దీని ప్రభావం ఉండే అవకాశాల నేపథ్యంలో నిండు వేసవిలో ధరల పెరుగుదల మరింతగా ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
హైదరాబాద్ @ 39.2 డిగ్రీలు
నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు సాక్షి, హైదరాబాద్: వేడి గాలులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వేడిగాలులు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విద్యుత్ వినియోగం పైపైకి... నగరంలో ఉష్ణోగ్రతలు అనుహ్యంగా పెరగడం తో విద్యుత్ వినియోగం కూడా రెట్టిపైంది. గ్రేటర్లో గత 2 రోజుల్లో విద్యుత్ వినియోగం 53.8 మిలియన్ యూనిట్లు నమోదైంది. మార్చి లోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో విద్యు త్ వినియోగం 60 ఎంయూలు దాటే అవకాశం ఉందని డిస్కం అంచనా వేస్తోంది. పెరుగుతు న్న విద్యుత్ ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు ట్రిప్ప వుతూ సరఫరాకు అంతరాయం కలిగిస్తు న్నా యి. ఒత్తిడిని తట్టుకునేవిధంగా ఇప్పటికే సరఫ రా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామా బాద్, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 48 గంటలు రాష్ట్రంలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెరిగిన విద్యుత్ డిమాండ్... ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. గత మార్చిలో 148.73 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ కాస్తా ఈ మార్చిలో ఏకంగా 184.11 మి.యూనిట్లకు పెరిగింది. వడదెబ్బతో నలుగురి మృతి నెట్వర్క్: వడదెబ్బతో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం యల్లాపురంలో గడగోజు దుర్గాచారి(51), రంగుండ్లలో ఆంగోతు రవి నాయక్, ఇదే జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో నక్క చంద్రమ్మ (70), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గొల్ల నర్సింలు (56) వడదెబ్బతో మృతి చెందారు. -
ఆదిలాబాద్@41 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రా చలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే 4 రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.