ఎండకూ లొంగని స్వైన్‌ఫ్లూ.. | 35 Swine Flu cases were recorded within four days | Sakshi
Sakshi News home page

ఎండకూ లొంగని స్వైన్‌ఫ్లూ..

Published Mon, Mar 18 2019 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 2:31 AM

35 Swine Flu cases were recorded within four days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ వైరస్‌ ఎండ మంటకూ లొంగడం లేదు. సాధారణంగా చలికాలంలో విజృంభించే హెచ్‌1ఎన్‌1 వైరస్‌... విచిత్రంగా ఎండలు దంచుతున్నా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెల ఇప్పటివరకు ఏకంగా 573 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో వెల్లడించింది. వీరిలో 12 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఈ నాలుగైదు రోజుల్లోనే 35 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిపింది. రెండ్రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ఇద్దరు మృతిచెందారు.

చలికాలంలో విస్తృతిని పెంచుకునే వైరస్, ఎండలు మండుతున్నా తట్టుకుని ఉంటోందని వైద్య నిపుణులు అంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 14,992 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 1,103 మంది చనిపోయారు. దారుణ విషయం ఏంటంటే.. ఈ ఏడాది రెండున్నర నెలల కాలంలోనే 20 వేల స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 605 మంది చనిపోయారు. గతేడాది నమోదైన కేసుల కంటే, ఈ రెండున్నర నెలల్లో నమోదైన కేసులు అధికంగా ఉండటం గమనార్హం. పైగా ఈ రెండున్నర నెలల్లో నెల మాత్రమే చలికాలం కాగా, మిగతాదంతా ఎండా కాలం. 

ఎన్నికలపై ప్రభావం... 
ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ప్రజలు గుంపులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇలా గుంపులుగా ఉన్నప్పుడే స్వైన్‌ఫ్లూ వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ మరింత సోకి కేసులు సంఖ్య పెరగవచ్చని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఏమీ కాదన్న ధీమాతో ఉంటే పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం కావాల్సి ఉంది. కాగా కేసులు నమోదవుతున్నా వైద్య ఆరోగ్యశాఖ కనీసం పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement