
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు కరోనా వైరస్ అనుమానాలు వణికిస్తుంటే.. మరో వైపు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా స్వైన్‌ఫ్లూ ప్రభావం చలికాలంలోనే ఉంటుంది.. కానీ సీజన్ కాని సీజన్‌లో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రిలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ 15 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవ్వగా.. ఫిబ్రవరి నెలలోనే 8 కేసులు నమోదయ్యాయి. జలుబు, జ్వరం, దగ్గు, శ్వాస కోశ సమస్యలతో కరోనా వైరస్ అనుమానంతో ఆసుపత్రులకు వెళ్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే స్వైన్‌ఫ్లూ బయటపడుతుంది.
చలి తీవ్రత తగ్గిన ప్రభావం తగ్గలేదు..
వేసవి ప్రారంభం కాగానే వైరస్ ప్రభావం తగ్గుతుంది. కానీ చలి తీవ్రత తగ్గిన స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గలేదు. గత ఏడాది స్వైన్ ఫ్లూతో పది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.. సాధారణంగా శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి.. ప్రస్తుత వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల దాని ప్రభావం తగ్గలేదని వైద్యులు చెబుతున్నారు. స్వైన్‌ప్లూ బారి నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.