
వృద్ధురాలికి కౌన్సెలింగ్ ఇస్తున్న సైకియాట్రిస్ట్ అజయ్‌కుమార్
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): కరోనా భయంతో మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వృద్ధురాలికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన 65 ఏళ్ల పుష్పావతి(పేరుమార్చాం) కరోనా పాజిటివ్‌తో గత నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. కరోనా భయంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన ఆమె ఏప్రిల్ 28వ తేదీన ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గమనించిన తోటి రోగులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వృద్ధురాలిని నిలువరించి వార్డులో చేర్చి మంచానికి కట్టేసి వైద్యసేవలు అందించారు. ఈ మేరకు గతనెల 29వ తేదీన ‘కరోనా బాధితురాలి ఆత్మహత్యాయత్నం’ శీర్షికతో సాక్షిలో ప్రచురించిన కథనానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పందించారు. వృద్ధురాలికి సపర్యలు చేసేందుకు కేర్‌టేకర్‌ను నియమించి ప్రత్యేక వైద్యం అందించారు. మానసిక రుగ్మతలు నివారించేందుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ జూపాక అజయ్‌కుమార్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించారు. మరోమారు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బుధవారం ఆమెను డిశ్చార్జీ చేశారు. సదరు వృద్ధురాలు గతంలో సెరిబ్రోవాసు్కలర్ ఎటాక్ (సీవీఏ)తో బాధపడుతుండేదని, కరోనా సోకడంతో అయోమయానికి గురైన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మానసిక వైద్యుడు అజయ్‌కుమార్ తెలిపారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, కృషి చేసిన ‘సాక్షి’ దినపత్రికకు వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
( చదవండి: Coronavirus: కోవిడ్ మళ్లీ సోకితే ఏం చేయాలి? )
Comments
Please login to add a commentAdd a comment