మిర్యాలగూడ : కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. వేసవికాలంలో జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు తగ్గింది. దీంతో జిల్లా జనాభాకు సరిపోకపోవడంతో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి ఖర్చులు పెరిగిపోవడం వల్ల అదే రీతిలో ధరలు పెంచారు. గత నెలకు ప్రస్తుత ధరలతో పోల్చితే మరింతగా పెరిగాయి. వ్యాపారులు కూరగాయలన్నీ విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కేవలం ఆకుకూరలు పట్టణాల శివారు ప్రాంతాల్లో సాగు చేయడం వల్ల వాటికి మాత్రమే తక్కువగా ధరలు ఉన్నాయి. అవి కూడా కేవలం ఉదయం వేళలోనే లభిస్తున్నాయి.
పచ్చిమిర్చి మరింత ప్రియం
జిల్లాలో 3,200 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు ఉంది. వేసవి కావడంతో సాగు సగానికిపైగా తగ్గింది. జూలైలో కొత్తగా నార్లు పోసుకుంటారు. జూన్ నుంచి కొత్త పంటలు సాగు చేయనున్నారు. అక్టోబర్ వరకు వానాకాలం పంటలు బెండకాయ, దోసకాయ, గోకర, బీర, కాకర తదితర పంటలు సాగు చేస్తారు. ఈ క్రమంలో మే నెలలో ఎండల తీవ్రతకు రైతులు పంటలు సాగు చేయలేదు. ఈ ప్రభావం ధరలపై తీవ్రంగా పడింది. పచ్చిమిర్చి మరింత ప్రియంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలలో పచ్చి మిర్చి లభించడం లేదు. వ్యాపారులు గోవా, బెంగళూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రోజుకు ఒక లారీ పచ్చిమిర్చిని మిర్యాలగూడకు దిగుమతి చేసుకుంటే మార్కెట్‌లోని వ్యాపారులంతా తీసుకొని వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పచ్చిమిర్చి కిలో 40 నుంచి 50 రూపాయలుగా ఉంది. అదే విధంగా టమాట కూడా స్థానికంగా లేకపోవడం వల్ల కనిగిరి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కిలో టమాట 15 రూపాయలకు విక్రయిస్తున్నారు.
వారంలో పెరగనున్న ధరలు..
మరో వారం రోజుల్లో కూరగాయల ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవడం వల్ల దిగుమతి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
సామాన్యులకు ధరలు భారమే
కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాయి. సామాన్యులు అంత ధర పెట్టే పరిస్ధితి లేదు. ఉల్లిగడ్డ, టమాట తప్ప అన్నింటికీ ధరలు బాగానే ఉన్నాయి. ఎండా కాలం కావడం వల్ల కూరగాయలు కూడా రుచిగా లేవు. రోజు రోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
– నాగలక్ష్మి, దొండవారిగూడెం
వ్యాపారం బాగానే ఉంది
గత నెల కంటే ఈ నెలలో కొంత వరకు వ్యాపారం బాగానే ఉంది. కానీ ఎండలు విపరీతంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల నుంచి జనం రాకపోవడంతో కొంత ఇబ్బందిగానే ఉంది. మిర్చి గోవా, బెంగళూరు నుంచి వస్తుంది. దూరం నుంచి తీసుకరావడం వల్ల భారీ ఖర్చు అవుతుంది. టమాటను మాత్రం కనిగిరి నుంచి తీసుకవస్తున్నాం.
– సత్తిరెడ్డి, వ్యాపారి (మిర్యాలగూడ)
భగ్గు మంటున్న ధరలు
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మిర్చి, కాకర, బీరకాయలు కొనలేని పరి స్థితి ఉంది. దీంతో సామాన్యులకు చాలా ఇబ్బందిగా మారి పోయింది. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కూరగాయలు కావడం వల్ల వారం రోజు లకు సరిపడా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటే చెడిపోతున్నాయి.
– ప్రమీల, మిర్యాలగూడ
Comments
Please login to add a commentAdd a comment