షోరూంలోనే రిజిస్ట్రేషన్లు | Vehicle Registrations Will Be In Show Rooms | Sakshi
Sakshi News home page

షోరూంలోనే రిజిస్ట్రేషన్లు

Published Thu, Nov 15 2018 1:06 AM | Last Updated on Thu, Nov 15 2018 11:50 AM

Vehicle Registrations Will Be In Show Rooms - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి వాహనం కొన్న తరువాత పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌), హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ కోసం ఆర్‌టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. ఈ మేరకు వాహనదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఓ కొత్త జీవోను వెలువరించింది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) స్థానంలో ఏకంగా ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసేస్తారు. పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌తో కొత్త వాహనం రోడ్డెక్కేయొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది.

మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో మార్పులు, జీవితకాల పన్ను చెల్లింపుల్లోనూ, ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్‌ (వాహన తయారీ ధరలు) వెల్లడించకపోవడం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే ప్రస్తుతం ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే అదనంగా 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇలాంటి అదనపు వసూళ్లకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలనేది  అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించిన అనంతరం జీవో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

వాహనదారులకు దీంతో ఒకింత ఊరట ఉన్నా షోరూమ్‌ల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హ్యాండ్లింగ్‌ చార్జీలు, ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌ల పేరిట వాహనదారులపైన రూ.3,000 నుంచి రూ.5,000 వరకు అదనంగా భారం మోపుతున్నారు. ప్రస్తుతం వాహనదారుడి పేరు, చిరునామా, ఆధార్‌ నంబర్, వాహ నం చాసీస్‌ నంబర్, ఇంజన్‌ నంబర్ల నమోదులోనే తరచుగా తప్పులు దొర్లుతున్నాయి. ఈ పొరపాట్లను సవరించుకొనేందుకు వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. షోరూమ్‌ల్లో రిజిస్ట్రేషన్లతో ఇది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అంతేగాక ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement