వేంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): ముప్కాల్ మండలం వేంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను, విద్యార్థుల డ్రెస్ కోడ్, పాఠశాలలో వసతులను, విద్యా బోధనను చూసి ప్రైవేటు పాఠశాల అనుకుంటే పప్పులే కాలు వేసినట్లే. ఇదంతా ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. వేంపల్లి ప్రాథమిక పాఠశాల నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు 210 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. 2015–16 విద్యా సంవత్సరంలో పాఠశాలలో కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలకు పంపించకుండ ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని తీర్మానం చేశారు.
అప్పటి నుంచి పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. 2015–16లో 23 మంది విద్యార్థులతో ప్రారంభమైంది మండలంలోని వేంపల్లి ప్రాథమిక పాఠశాల. అదే సంవత్సరం గ్రామంలోని యువకులు, గ్రామస్తులు అంత కలిసి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపకూడదని తీర్మానం చేయడంతో విద్యార్థుల సంఖ్య 130కి చేరింది. 2016–17 విద్యా సంవత్సరంలో వీడీసీ, గ్రామస్తులు ఐక్యంగా నిలబడి ప్రైవేట్ బడికి పిల్లలను పంపకూడదు అని మళ్లీ తీర్మానించడంతో విద్యార్థుల సంఖ్య 180కి చేరింది. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుండటంతో ప్రస్తుతం పాఠశాలలో 210 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో పాఠశాలలో ప్రవేశానికి నో ఎంట్రీ బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో ఇంగ్లిష్ మీడియం ప్రావేశ పెట్టారు. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు 210 మంది చదువుతున్నారు. వేంపల్లిలో గతంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో క్రమేణా ప్రాథమిక పాఠాశాలగా మార్చారు. నాలుగేళ్ల క్రితం పాఠశాలలో 23 మంది విద్యార్థులే పాఠశాలలో చదివేవారు. దీంతో ప్రాథమిక పాఠశాలను కూడా మూసేస్తారని భావించిన గ్రామస్తులు బడిని బతికించడానికి కంకణం కట్టుకున్నారు. తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలు, ఇతర గ్రామాలకు పంపమని తల్లితండ్రులు తీర్మానం చేసుకోవడంతో ప్రస్తుతం 210 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పాఠశాల నిర్వహణకు నిధి..
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులే ఐదుగురు విద్యా వలంటీర్లను నియమించారు. వారి జీతాల కోసం, పాఠశాల నిర్వహణలో కోసం గ్రామస్తులు 2015–16 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక నిధి ఏర్పాటు చేశారు. గ్రామంలో 300 కుటుంబాలుంటాయి. ప్రతి కుటుంబం నుంచి రూ. వేయి వసూలు చేసుకుని నిధి ఏర్పాటు చేశారు. అంతేకాకుండ గ్రామంలోని ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల సభ్యులు ప్రతి సంవత్సరం విరాళాలు అందిస్తున్నారు. దీంతో రూ.మూడు లక్షల నిధిని గ్రామస్తులు ఏర్పాటు చేస్తే దానికి దాతల సహకారం లభిస్తుంది. ప్రతి సంవత్సరం విద్యా వలంటీర్లకు ఆ నిధి నుంచే జీతాలను చెల్లిస్తున్నారు. దానికి తోడు గ్రామంలో పలువురు దాతలు ముందుకు రావడంతో పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. విద్యార్థులు గురుకుల పాఠశాల ప్రవేశాల్లో సత్తా చాటుతున్నారు. 2016–17లో 19 మంది, 2017–18 లో 23 మంది, 2018–19లో 23 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు.
తరగతి గదుల కొరత
మూడేళ్లుగా వేంపల్లి ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా కొనసాగుతోంది. కాని పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినా ఉపాధ్యాయుల సంఖ్యను మాత్రం అధికారులు పెంచడం లేదు. దీంతో గ్రామస్తులకు విద్యా వలంటీర్ల వేతనాలు భారంగా మారాయి. రెగ్యులర్ పోస్టులు రెండు ఉన్నాయి. ఇద్దరు డిప్యూటేషన్‌పై వచ్చారు. గ్రామస్తులు ఐదుగురు విద్యా వలంటీర్లను నియమించారు. ప్రభుత్వం కూడా ఒక వలంటీర్‌ను పంపించింది. ప్రస్తుతం ఇతర గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు తరలి వస్తున్నారు. కానీ తరగతి గదుల కొరత తీవ్రంగా ఉండటంతో నో అడ్మిషన్సు బోర్డు పెట్టాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ తరగతులు
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలను దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. రెండు ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, గ్రీన్ బోర్డులు, నర్సరీ పిల్లలకు ఆట వస్తువులు కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సహకారం ఉండటంతో వేంపల్లి పాఠశాల ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది.
అందరి సహకారంతో..
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచుటకు గ్రామస్తులు అండగా నిలుస్తున్నారు. గడపకు రూ.వేయి అందించుటకు ముందుకు వచ్చినప్పటి నుంచి సహకారం అందిస్తున్నారు. గ్రామంలో దాతలు ముందుకు రావడంతో పాఠశాలలో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం.
– గంగాధర్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు
గ్రామస్తుల ఆదర్శాన్ని కాపాడుతున్నాం
గ్రామస్తులు తీసుకున్న ఆదర్శ తీర్మానాన్ని కాపాడుతున్నాం. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకు రావాడానికి కృషి చేశాం. ప్రస్తుతం ఆ ఫలాలు అందుకుంటున్నాం. తరగతి గదుల కొరతతో విద్యార్థులను చేర్చుకోలేకపోతున్నాం. స్థానికుల కృషి అభినందనీయం.
– లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం, వేంపల్లి
Comments
Please login to add a commentAdd a comment