అథ్లెటిక్స్‌లో గిరిపుత్రుడు
గిరిజనతండాలు అంటేనే అత్యంత వెనుకబడిన ఆవాస ప్రాంతాలకు నిలయాలు. కనీస వసతులతోపాటు రవాణా సౌకర్యం అసలే ఉండదు. దీంతో అక్కడి ప్రజలు దయ నీయ పరిస్థితుల మధ్య జీవన పోరాటం చేస్తుంటారు. అలాంటి తండాకు చెందిన ఓ యువకుడు అథ్లెటిక్స్‌లో చిరుత వేగతంలో దూసుకెళ్లి సత్తాచాటుతున్నాడు. అతడే కోదాడ మండలంలోని భీక్యాతండాకు చెందిన గగులోతు వెంకటేష్. ఇతడు అనతికాలంలోనే మండలస్థాయి నుం చి అంతర్‌జిల్లాల స్థాయి పోటీల్లో పాల్గొని పలు బహు మతులు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
-భీక్యాతండా (కోదాడ రూరల్)
కోదాడ మండలంలోని భీక్యాతండా గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గుగులోతు భద్యా- లక్ష్మి దంపతుల రెండో కుమారుడు వెంకటేష్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ పరుగు పందెంలో పాల్గొనడమంటే ఎగిరి గంతేంచేవాడు. ఆ మక్కువతోనే ఎక్కడ అథ్లెటిక్స్ జరిగినా పాల్గొని మెరుపు వేగంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకునేవాడు. ఇలా మండల స్థాయి అథ్లెటిక్స్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పాల్గొని ఎన్నో పతకాలు, ప్రశంసపత్రాలు సొంతం చేసుకున్నాడు. హైస్కూల్ చదివేటప్పుడే మూడేళ్ల పాటు వరుసగా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అందరి మన్ననలు పొందాడు. అథ్లెటిక్స్‌లోనే కాకుండా మరోవైపు లాంగ్‌జం ప్, క్రికెట్ పోటీల్లో కూడా ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం ఆడి పలు విజయాలతో బహుమతులు దక్కించుకున్నాడు.
చదువుల్లోనూ ముందే..
ఆటలతో పాటు చదువులోనూ గుగులోతు వెంకటేష్ ముం దంజలోనే కొనసాగుతున్నాడు. 1 నుంచి 5 వరకు స్వగ్రామంలో చదివిన వెంకటేష్ 6 నుంచి పదో తరగతి వరకు చిలుకూరు మండలం నారాయణపురంలో చదివాడు. అనంతరం ఇంటర్మీడియట్‌ను కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిచేశాడు. తన హైస్కూల్, ఇంటర్ చదువులు ప్రతిరోజూ సైకిల్ మీద వచ్చి చదివాడు.
ఇంటర్మీడియట్‌లో ఇతడు సాధించిన అత్యుత్తమ మార్కులను చూసిన చిలుకూరు మండలం రామాపురంలో గల గాంధీ అకాడమిక్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గేట్) కళాశాల యాజమాన్యం స్పందించి తమ కళాశాలలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్) కోర్సును ఉచితంగా చదివించింది. ఆ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహంతో వెంకటేష్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని తన సత్తాచాటాడు. అనంతరం వెంకటేష్ పీసెట్ రాసి రాష్ట్రస్థాయిలో 508 వ ర్యాంకు సాధించి ప్రస్తుతం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఖాళీగా ఉండకుండా స్థానిక విద్యార్థులకు క్రీడల్లో మెళకువలను నేర్పుతున్నాడు.
వెంకటేష్ సాధించిన విజయాలు
* 2003, 04, 05 సంవత్సరాల్లో 8 ,9, 10వ తరగతులు చదువుతున్నప్పుడు జిల్లాస్థాయిలో నిర్వహించిన వందమీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్ పోటీల్లో పాల్గొని ప్రతిఏటా జిల్లా మొదటిస్థానంలో నిలిచాడు.
* 2006లో నిర్వహించిన ఇంటర్‌లెవల్ స్కూల్‌స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నాడు.
* ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా 2013లో నల్లగొండడలో నిర్వహించిన జిల్లాస్థాయి వందమీటర్ల పరుగు పందెంలో 11 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
* 2014 మార్చిలో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రశంసపత్రం పొందాడు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
ఇప్పటికే చాలా పోటీల్లో పాల్గొని సత్తాచాటాను. దాతలు ప్రోత్సహిస్తే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నిరూపించుకుంటా. క్రీడల్లో రాణించే గిరిజన విద్యార్థులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. భవిష్యత్‌లో విద్యార్థులకు ఉచితంగా క్రీడా పాఠాలు నేర్పుతా.
- గగులోతు వెంకటేష్, అథ్లెటిక్స్