అన్యాయంగా చంపారు
వికార్ తండ్రి అహ్మద్.. శిక్షించేందుకు పోలీసులెవరంటూ ఆగ్రహం
హైదరాబాద్: తన కుమారుడు వికారుద్దీన్‌ను పోలీసులు అన్యాయంగా ఎన్‌కౌంటర్ చేశారని అతని తండ్రి మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. చేతులకు బేడీలున్నవాళ్లు ఎలా తప్పించుకోగలరు? నేరం చేస్తే కోర్టులు శిక్షించాలిగానీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడమేంటి? ప్రభుత్వం, పోలీసులు నీచంగా నా కొడుకునుబలి తీసుకున్నారు’’ అంటూ ఆగ్రహించారు. వికార్‌పై కేసులను కొట్టేసే దశలో ఎన్‌కౌంటర్ చేయడం దుర్మార్గమని మంగళవారం తన నివాసంలో విలేకరులతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని, ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అహ్మద్ డిమాండ్ చేశారు.
ఎన్‌కౌంటర్ చేసిన వారిపై కేసులు పెట్టనిదే మృతదేహాన్ని తీసుకెళ్లబోమని హెచ్చరించారు. ‘‘నా కొడుకును పది రోజుల క్రితం వరంగల్ జైల్లో చూశాను. విచారణ 90 శాతం పూర్తయిందని, ఒకట్రెండు నెలల్లో బయటికొస్తానని చెప్పాడు. సిమీతో తనకు ఏ సంబంధమూ లేదు. నా ఐదుగురు సంతానంలో వికార్ నాలుగోవాడు. బి.కాం. మధ్యలో ఆపేశాడు. 2009లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 2011లో అరెస్టు చేసి జైల్లో పెట్టారు’’ అని చెప్పారు. ఇది పక్కా పోలీసు హత్య అని, కేసులను కొట్టేసే దశలో ఎన్‌కౌంటర్ చేయడంపై న్యాయ విచారణకు సిద్ధమవుతామని న్యాయవాదులు ఎం.ఎ.అజీమ్, ఎస్.కె.సైఫుల్లా అన్నారు.