లక్ష్యం.. లక్ష లీటర్లు! | Vijaya Dairy ready to Mineral Water Sale | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. లక్ష లీటర్లు!

Published Sun, Sep 2 2018 3:06 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

Vijaya Dairy ready to Mineral Water Sale - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాల వ్యాపార సంస్థ విజయ డెయిరీ.. మినరల్‌ వాటర్‌ విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అంతర్గతంగా మినరల్‌ నీటిని తయారు చేస్తూ పరిశీలిస్తున్న సంస్థ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ముందుగా లక్ష లీటర్లు లక్ష్యంగా మార్కెట్‌లోకి అడుగిడుతున్నామని.. 200 మిల్లీ లీటర్లు, అర లీటరు, లీటరు బాటిళ్లతో పాటు 20 లీటర్ల క్యాన్లను తీసుకొస్తున్నామని డెయిరీ వర్గాలు తెలిపాయి.  

తొలుత హైదరాబాద్‌లో..  
హైదరాబాద్‌ లాలాపేటలోని విజయ డెయిరీ ప్లాంటులోనే అత్యాధునిక వాటర్‌ ప్లాంటును నెలకొల్పారు. తొలుత హైదరాబాద్‌లో తాగు నీటిని సరఫరాకు టెండర్లు ఆహ్వానించారు. త్వరలో వాటిని ఖరారు చేసి ఏజెంట్ల ద్వారా సరఫరా ప్రారంభిస్తారు. నీటి ధరపై మాత్రం యాజమాన్యం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మార్కెట్‌లోని ప్రముఖ కంపెనీల ధరలకు కాస్త తక్కువుండేలా కసరత్తు చేస్తున్నారు. అత్యంత తక్కువకు అమ్మడం సాధ్యమవదని, సరైన ప్రమాణాలు ఉండాలంటే ఆ స్థాయిలో ధర తప్పదని చెబుతున్నారు.  

‘కొత్త’మార్కెటింగ్‌ 
విజయ డెయిరీ పార్లర్లను రాష్ట్రవ్యాప్తం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 150 డెయిరీ పార్లర్లు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను 1,000కి పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లర్లలో ప్రస్తుతం 14 రకాల పాల ఉత్పత్తులు విక్రయిస్తుండగా త్వరలో మరిన్ని ఉత్పత్తులనూ పరిచయం చేయాలని నిర్ణయించారు. కొన్ని రకాల రుచుల్లో (ప్లేవర్స్‌) పాలను, బాసుంది, కీర్‌ మిక్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. టీ స్టాళ్లు, హోటళ్లను దృష్టిలో ఉంచుకొని టీ చేసుకోడానికి మాత్రమే ఉపయోగపడే పాల ను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. పాల ఉత్పత్తుల ప్యాకెట్లు, నాణ్యతలో మా ర్పులు చేయనున్నారు. మార్కెటింగ్‌లో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టి మార్కెటింగ్, ప్రచార వ్యవస్థనూ పటిష్టం చేయనున్నారు.  

త్వరలో మెగా డెయిరీ: అధికారులు 
విజయ పాలు, పాల ఉత్పత్తులే శ్రేయస్కరమని డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా చెప్పారు. శనివారం సోమాజీగూడలో విజయ పార్లర్‌ ప్రారంభించిన తర్వాత వారు మాట్లాడుతూ.. విజయ పాలను వినియోగదారుల వద్దకు తీసుకెళ్లేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రస్తుతం లాలాపేటలో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల డెయిరీ అందుబాటులో ఉందని, దాని స్థానంలో 10 లక్షల లీటర్లతో మెగా డెయిరీకి కసరత్తు చేస్తున్నామన్నారు. అందుకు రుణం కూడా మంజూరైందని తెలిపారు. మెగా డెయిరీని ఎక్కడ నెలకొల్పాలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement