సాక్షి, హైదరాబాద్: సామ్రాజ్యవాదం కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. శాంతి, సౌభ్రాతృత్వం కోసం విద్యార్థులు, యువతను తగిన రీతిలో తీర్చిదిద్ది, వారిని ఈ రంగంలో ఉపయోగించే విషయంలో మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు.
శనివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా పీస్, సాలిడారిటీ ఆర్గనైజేషన్ ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఆసన్నమైందన్నారు. ఇటీవలి తన అమెరికా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు దృష్టికి వచ్చాయని, అక్కడి యువత ఆర్థికంగా ఎదగడం కన్నా సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన ప్రస్తావించారు.
ఆహ్వాన సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నాయకుడు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, శాంతి సంఘీభావ సంఘం నాయకులు పల్లబ్ సేన్ గుప్తా, అరుణ్ కుమార్, తిప్పర్తి యాదయ్య, జగన్మోహన్, రఘుపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment