హైదరాబాద్ కేంద్రంగా త్వరలో ‘విస్తారా’ సేవలు
మంత్రి కేటీఆర్‌ను కలసిన టాటా గ్రూప్ ప్రతినిధులు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్ సేవలను అందించేందుకు టాటా గ్రూప్ ఆసక్తిని కనబరిచింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ సీఈవో ఫీతెక్‌తో సహా పలువురు టాటాగ్రూప్ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టాటాగ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నగరంలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మౌలికవసతుల పరంగా బాగుందని, కొత్తగా ఎయిర్‌లైన్స్ సేవలను ప్రారంభించే ఏ సంస్థకైనా ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్ ద్వారా త్వరలోనే ఇక్కడి ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి సేవలను ప్రారంభిస్తామన్నారు. తమ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏవియేషన్ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను టాటాగ్రూప్ ప్రతినిధులకు వివరించారు. నగరంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏటా 20 శాతం ప్రయాణీకుల వృద్ధిరేటును సాధిస్తోందన్నారు. కొత్తగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు ప్రారంభించిన ‘విస్తారా’కు ఇది మంచి అవకాశంగా మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టాటాగ్రూప్‌కు ఇప్పటికే విస్తృతమైన ఉనికి ఉందని, పలు టాటా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మెరుగైన వసతులున్నాయని, త్వరలోనే విమాన ఇంజనీర్ల శిక్షణా సంస్థ కూడా తమ కార్యకలాపాలను నగరంలో ప్రారంభించనుందన్నారు. సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ‘విస్తారా’ ఎయిర్‌లైన్స్ సలహాదారు గుజ్రోత్ మాలి తదితరులున్నారు.