హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో నేడు (సోమవారం) హైకోర్టులో కీలక పరిణామాలు జరగనున్నాయి. తనపై ఉన్న కేసులను కొట్టి వేయాలంటూ ఈ కేసులో A-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వేసిన పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలంటూ... నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు వెలువడిన తర్వాతనే - మత్తయ్య పిటిషన్‌పై కోర్టు నిర్ణయం వెలువరించనుంది. ఇక ఈ కేసులో మత్తయ్య ఇప్పటికీ పరారీలో ఉండగా, ఏసీబీ నోటీసులు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 16న విచారణకు హాజరు కావల్సి ఉన్నా ఎమ్మెల్యే సండ్ర అనారోగ్యం కారణంగా రాలేనని లేఖ రాసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్నందున... అధికారులు ఇవాళ ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరుచనున్నారు. కోర్టు ఆయన జ్యుడిషియల్ కస్టడీని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రేవంత్తో పాటు సెబాప్టియన్, ఉదయసింహాల జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది.
అలాగే ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ తరుపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించగా... రేవంత్‌రెడ్డి తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధలూత్రా వాదనలు వినిపించారు. శుక్రవారం గంటకుపైగా వాదనలు విన్న న్యాయమూర్తి... రేపు తీర్పు వెలువరించనున్నారు. మంగళవారం అడ్వకేట్ జనరల్ రాతపూర్వకంగా వాదనలను కోర్టు ముందుంచనున్నారు. ఇక దాదాపు 30రోజులుగా జైలులో ఉన్న రేవంత్‌రెడ్డి బెయిల్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఓటుకు కోట్లు కేసులో నేడు కీలక పరిణామాలు!
Published Mon, Jun 29 2015 10:43 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement