సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు లెక్కలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్స్ ముందు ఉంచి మరీ... రూ. 50 లక్షలతో పాటు ఇవ్వజూపిన మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖ ఇచ్చిన సమాచారంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.
కాగా 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ఈ కేసులో ఈడీ ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉదయ సింహను విచారించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment