ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో ఓటరు సందడి మొదలు కానుంది. కొత్తగా యువతీ, యువకులు తమ ఓటును జాబితాలో నమోదు చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫొటో ఓటర్ల తుది జాబితా తయారీకి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అర్హులు.
ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు అర్హులైన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 8 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో దాదాపు లక్ష మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు అధికారులు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిల్లా యంత్రాంగం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా ఆర్డీవోలకు అందజేసి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం వరకు కొన్ని మండలాలకు ముసాయిదా ఓటరు జాబితాలు అందాయి. నమోదు కోసం నాలుగు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను సైతం నిర్వహించి లక్ష్యం చేరుకోనున్నారు.
2,257 పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 2,257 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు నమోదు ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ కేంద్రాలతోపాటు తహశీల్దార్, ఆర్డీవో, మున్సిపాలిటీ, మీ సేవలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19న, 26న గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రకటించిన అనంతరం అన్ని గ్రామాల్లో జాబితా ప్రకటించాల్సి ఉంటుంది.
మార్పులు, చేర్పులు, తొలగింపులు, తప్పొప్పులను సరి చేసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రాామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదుపై శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాగా, సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 226 పోలింగ్ కేంద్రాలు ఉండగా, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, అసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
షెడ్యూల్ ఇదీ..
ఈ నెల 13న ముసాయిదా ఫొటో ఓటరు జాబితా విడుదల
ఈ నెల 13 నుంచి డిసెంబర్ 8 వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగనుంది. ఇందులో కొత్తగా, మార్పులు, చేర్పులు, తొలగింపులు, తదితర వాటి కోసం అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఈ నెల 19న, 26న గ్రామ పంచాయతీలలో, సభలలో ఓటర్ల జాబితా ప్రకటించడం. అనంతరం ఓటర్ల జాబితా చదివి విన్పించడం. చదివిన ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉన్నట్లైతే.. పేరుండి ఫొటో లేనట్లైతే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 16న, 23న, 30న, డిసెంబర్ 7న నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తారు.
నమోదు ప్రక్రియ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి, తప్పొప్పులను సరి చేసిన అనంతరం తయారు చేసిన ఓటరు జాబితాను డిసెంబర్ 22న ప్రకటిస్తారు.
2015 జనవరి 5లోగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో కొత్త ఓటర్ల వివరాలను అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన నెల రోజులలోపు సంబంధిత ఓటరుకు ఎన్నికల కమీషన్ నుంచి ఓటరు గుర్తింపు కార్డు రానుంది.
2015 జనవరి 15న తుది జాబితాను విడుదల చేస్తారు.
ఓటరు సందడి..!
Published Fri, Nov 14 2014 3:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement