వరంగల్‌: ఓట్ల గల్లంతు ఆవేదన | Voters Disappointment For Election Commission In Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌: ఓట్ల గల్లంతు ఆవేదన

Published Sat, Dec 8 2018 11:24 AM | Last Updated on Sat, Dec 8 2018 11:27 AM

Voters Disappointment For Election Commission In Warangal - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగామలో హైవేపై ఆందోళన చేస్తున్న ఓటర్లు

      కొత్తగా ఓటు నమోదు, సవరణలు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే 20 ఏళ్లుగా ఓటు వేస్తున్న వారి ఓట్లు  గల్లంతు కావడంతో నిరాశే ఎదురైంది. శుక్రవాం ఓటు స్లిప్పులతో పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు అధికారుల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వెనుతిరిగారు. ఒకరి బదులు మరొకరు ఓటు వేసిన ఘటనలు సైతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జరిగాయి.

పరకాల: పట్టణంలోని 59, 60 పోలింగ్‌ బూత్‌ల్లో రెండువందలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి.
ములుగు: నియోజకవర్గం గోవిందరావుపేటలో 200 మంది ఓట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండగా బతికున్న తమ పేర్లు తొలగించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొంగులూరి సంజీవ అనే వ్యక్తి ఓటు తొలగించి, చనిపోయిన ఆయన కుమారుడు విజయ్‌కుమార్‌ పేరు మాత్రం రావడంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. 
దంతాలపల్లి: మండలం రేపోణి గ్రామ 101, 102 బూత్‌ల్లో 40 మంది ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. అలాగే వేములపల్లి గ్రామ 100వ పోలింగ్‌ బూత్‌లో గుమ్మడవెల్లి వెంకన్న బదులు సమీప బంధువు అయిన అదే గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి వెంకన్న ఓటు వేశాడు. వారిద్దరి తండ్రుల పేరు కూడా వెంకటయ్య కావడం కొసమెరుపు. తనకు ఓటు లేకపోయినా గుమ్మడివెల్లి వెంకన్న హైదరాబాద్‌ నుంచి వచ్చి ఓటు వేసి పోగా, ఊళ్లో ఉన్న మరో వెంకన్న ఓటు వేయకపోవడంతో స్థానికుల్లో చర్చనీయాంశమైంది.
ఖిలావరంగల్‌: వరంగల్‌ 20వ డివిజన్‌ ఏకశిలనగర్‌ వరంగల్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన 115 బూత్‌లో కందిమల్ల ప్రభాకర్‌ ఓటును మరో వ్యక్తి వేశాడు. దీంతో తన ఓటు మరొకరు ఎలా వేస్తారని ఆందోళనకు దిగాడు. స్పందించి పోలింగ్‌ అధికారులు తనకు బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌కు అనుమతించారు. పొరపాట్లు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. 
స్టేషన్‌ఘన్‌పూర్‌:డివిజన్‌ కేంద్రంలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. దాదాపు 100 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో బాధితులు ఆవేదన చెందారు. బుడిగజంగాల కాలనీ, మాడల్‌ కాలనీ, ఎరుకలవాడ తదితర కాలనీలకు చెందిన వారు ఫొటో ఓటరు స్లిప్పులతో పోలింగ్‌ బూత్‌లకు వెళ్లగా ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. బాధితులు దేవరాజుల సమ్మయ్య, స్వరూప, మంగమ్మ, ప్రసాద్, నీరటి దయాకర్, కరుణాకర్‌ తదితరులు విలేకరులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. 
జనగామ:జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్‌ కళాశాల, పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ల్లో ఓట్లు గల్లంతు చేశారని ఆరోపిస్తూ.. బాధిత ఓటర్లు ఆందోళనకు దిగారు. 6, 7 వార్డులకు చెందిన సుమారు 150 మందికి పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఐడీ కార్డులతో పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరు కున్నారు. ఓటరు జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. వరంగల్‌–హైదరాబాద్‌ హైవేపై రాస్తారోకో చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌ కుమార్‌ తరలివచ్చి ఓటర్లను నచ్చ చెప్పడంతో ఆవేనదతో వెనుదిరిగారు. 
నిరాశగా.. 
లింగాలఘనపురం: మండలంలోని పటేల్‌గూడెంకు చెందిన పెంతల గాలయ్య, పెండ్లి గోపాల్‌కు ఫొటో ఓటరు స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అదే విధంగా నెల్లుట్ల వడ్డెర కాలనీకి చెందిన కొమ్మరాజుల ఎల్లమ్మ ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌ వరకు వచ్చి జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశతో వెళ్లిపోయింది.  
దొంగతనానికి గురైందని..
ములుగు: న ఓటును మరొకరు వేశారని ములుగు మండలకేంద్రానికి చెందిన గట్ల కోటిరెడ్డి గందరగోళానికి లోనుకావడంతో పాటు అధికారులను ప్రశ్నించారు. రికార్డుల ప్రకారం ఇప్పటికే ఓటు వేసినట్లు నమోదు అయిందని  ప్రిసైడింగ్, పోలింగ్‌ అధికారులు  చెప్పడంతో కోటిరెడ్డి షాక్‌ అయ్యాడు. చేసేదేమి లేక నిరాశక పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వచ్చారు.   

  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement