నగరంలోని అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో ఉండే హరికి... ఇప్పుడు చేతినిండా పని. ‘నా అభిమాన నేత గురించి ఫలానా పత్రికలో మంచి ఆర్టికల్ వచ్చింది. అది వెంటనే నా ఎఫ్‌బీ(ఫేస్‌బుక్)లో పోస్ట్ చేయాలి’ అంటున్న ఆ కుర్రాడి ఆరాటం... నగరంలో నెటిజన్లలో నెలకొన్న ఎలక్షన్ అటెన్షన్‌కు అద్దం పడుతోంది.
వాదాలు... నినాదాలు..
‘అన్నది పోస్ట్‌పెయిడ్ పార్టీ. తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ’ అంటూ ఎన్నికల్లో ఓడిన అనంతరం చిరంజీవి పార్టీని విలీనం చేస్తే ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్ ఆ పనిచేస్తున్నాడని పరోక్షంగా చేసిన ఈ కామెంట్ నెటిజన్ల ఆదరణకు నోచుకుంది. అలాగే ‘టీడీపీకి ఓటేయండి కాంగ్రెస్ నేతల్ని గెలిపించండి’ అనే నినాదం కూడా. ఇటీవల తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతున్న నాటితరం కాంగ్రెస్ నేతలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన ఈ వ్యంగ్య పిలుపు నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ‘సింహం సింగిల్‌గా వస్తుంది పందులే గుంపులు కడతాయి’ వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలను దృష్టిలో ఉంచుకుని ఓ సినిమా డైలాగ్‌ను అనుకరిస్తూ చేసిన పోస్ట్ ఇది.
ఇంకా పలు సరదా నినాదాలు నెట్‌లో బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ‘పదేళ్ల నుంచి నన్ను పదవికి దూరంగా ఉంచి రాజకీయ సమాధి చేసిన నిన్ను వదల బొమ్మాళీ వదల నేను పసు(పు)పతిని’ అంటూ చంద్రబాబును ‘అరుంధతి’ చిత్రంలోని విలన్‌తో పోలుస్తూ చేసిన పోస్ట్ విపరీతంగా షేరింగ్‌కు నోచుకుంది. ‘కూలిపోయిన మలేషియా విమానం గురించి 15 రోజులకు తెలిసింది. మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ గురించి 51 రోజుల్లో తెలుస్తుంది’ అంటూ కొందరు ఎద్దేవా చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. మోడీని స్తుతిస్తూ కొందరు.. రాహుల్‌ని ఆకాశానికెత్తేస్తూ మరికొందరు.. ఇలా తమ తమ అభిప్రాయాలతో సోషల్ మీడియాలో హడావుడి చేసేస్తున్నారు.
ఓటింగ్ షురూ..
బయటేమో గాని.. నెట్‌లో అప్పుడే పోలింగ్ కూడా మొదలైపోయింది. ‘ఓట్ ఫర్ నెక్ట్స్ సీఎం’ అనే ప్రశ్నార్థకంతో సహా జగన్/చంద్రబాబులకు ఓటింగ్‌ను ఆహ్వానిస్తున్నారు.
వీటిలో నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు కూడా. అలాగే ఓపెన్ బ్యాలెట్‌లో వైస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలకు ఓటేయమంటున్నారు. అలాగే పవన్-బీజేపీ-టీడీపీ పొత్తును సమర్థిస్తారా.. అంటూ ఓటింగ్‌కు దిగుతున్నారు.
దినపత్రికల క్లిప్పింగ్‌ల సందడి..
కొన్ని రోజుల క్రితం దాకా రాష్ట్ర విభజన అంశంపై సోషల్ మీడియా బాగా దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు మిగిలిన అన్ని అంశాలూ మరుగున పడిపోయి, కేవలం ఎన్నికలు, పార్టీలకే సోషల్ మీడియాలో అధిక ప్రాధాన్యం దక్కుతోంది. పత్రికల క్లిప్పింగ్‌లు, ఫొటోలు కూడా పూర్తిగా రాజకీయ ప్రాధాన్యంతో ఉన్నవే పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ఎన్నికల నేపధ్యంలో యువత ఫేస్‌బుక్ మీద వెచ్చించే సమయం కూడా బాగా పెరిగిందని నెటిజన్లు అంటున్నారు.
సోషల్ మీడియాలో రాజకీయ వేఢీ
Published Wed, Mar 26 2014 11:45 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement