సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటుహక్కు పొందేందుకు మరో అవకాశం లభించింది. ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పిస్తే.. సరిపోతుంది. గతంలో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారా..? ఓటు రాలేదా...? పేరు, చిరునామాలో మార్పు సమస్య పరిష్కారం కాలేదా..? మీరంతా నిశ్చింతంగా ఉండి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ (వచ్చే నెల) 12వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేవరకు గడువునిచ్చింది. అర్హులు ఆన్‌లైన్‌లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. వీటిని పరిశీలించి అర్హులకు త్వరితగతిన ఓటునందించే అవకాశముంది. డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటేయొచ్చు.
నిత్యం ఓటు నమోదుకు చాన్స్..కానీ..
ఏడాదిలో 365రోజులు 24గంటల పాటు ఓటు నమోదుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వచ్చే నెల 12వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశమిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు అనివార్య కారణాలతో ఎన్నికల సంఘం 12వ తేదీ వరకు గడువునిచ్చినట్లు తెలుస్తోంది. అందరూ కూడా గత నెల 25వ తేదీ వరకే ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందనే అపోహలో ఉన్నారు. అయితే వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించనుంది. ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంకా ప్రచారం కల్పించట్లేదు. త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం), ఓటర్ వెరిఫయిడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీ ప్యాట్)పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఓటు నమోదుపై కూడా ప్రచారం కల్పించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు.
ఓటర్లు పెరిగే అవకాశం..
సెప్టెంబర్ 10వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కాగా..కొత్త ఓటర్లుగా, మార్పులు, చేర్పులకోసం గత నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఫారం 6, 7, 8, 8ఏ వివిధ కేటగిరీలకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ)ల ద్వారా 59,186దరఖాస్తులు రాగా, ఆన్‌లైన్‌లో 19,566 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటినీ పరిశీలించిన అధికార యంత్రాంగం ఆ సమస్యలను పరిష్కరించారు. తాజాగా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు.
జిల్లాలో ఇప్పటివరకు 10,54,805మంది ఓటర్లు గా ఉండగా పురుషులు 5,18,681మంది ఉన్నారు. మహిళలు 5,36,053మంది ఉండగా ఇతరులు 71 మంది ఉన్నారు. జిల్లాలో వచ్చే నెల 12వ తేదీ వరకు ఓటరు దరఖాస్తులు, మార్పులు చేర్పులకు అవకాశం ఉండగా త్వరలో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశముంది.
నమోదు ప్రక్రియ ఇలా..
ఫారం 6: కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు
ఫారం 7: అభ్యంతరాల తొలగింపునకు
ఫారం 8: వివరాలు సరి చేసుకునేందుకు
ఫారం 8ఏ: ఓటర్ల జాబితాలో పేరును మరో చోటుకు మార్చుకునేందుకు.
Comments
Please login to add a commentAdd a comment