online Apply
-
వైఎస్సార్ వాహన మిత్ర.. కొత్తవారికీ అవకాశం
సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్ వాహనమిత్ర పథకం–2022–23’ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న ఆర్థిక సహాయం అందించనుంది. దీనికింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా.. ఈ ఏడాదికిగాను అర్హుల నుంచి రవాణా శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి.రాజాబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నవారితోపాటు కొత్తగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ► ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులుగా ఉన్నవారు తమ వాహనం వద్ద ఫొటోను గ్రామ, వార్డు సచివాలయంలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ► కొత్తగా వాహనం కొనుగోలు చేసిన డ్రైవర్లు తమ ఆధార్‌కార్డు, తెల్ల రేషన్ కార్డు, భూమి వివరాలు, ఆదాయ పన్ను, ఇంటి విద్యుత్ వినియోగం, కులం, ఇతర వివరాలకు సంబంధించిన అర్హత పత్రాలతో దరఖాస్తు చేయాలి. ► గత ఆరు నెలల్లో సగటున నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారు ఈ పథకానికి అనర్హులు. ఒకవేళ ఒకటికంటే ఎక్కువ ఇళ్లకు కలిపి ఒకే మీటరుంటే ఇళ్ల సంఖ్యను బట్టి ఒక ఇంటికి సగటు విద్యుత్ వినియోగాన్ని లెక్కిస్తారు. ► వచ్చిన దరఖాస్తులను ఆరు అంచెల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ► అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ నెల 9లోగా ఆమోదిస్తారు. ► 10న ఆ దరఖాస్తులను కలెక్టర్లు ఆమోదించిన తరువాత 11, 12 తేదీల్లో సీఎఫ్ఎస్ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్లకు పంపిస్తారు. ► ఇక అర్హులైనప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ► వారి ఫిర్యాదులను పరిశీలించి అర్హులుగా నిర్ధారణ అయితే వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. (క్లిక్: అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం) -
ట్రీపుల్ ఐటీ పిలుస్తోంది
కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు, తల్లిదండ్రులు భవిష్యత్ బంగారమయ్యే దారులవైపు కలలు కంటుంటారు. ఇందులో బాసర ట్రీపుల్ ఐటీ ఒకటి. ప్రభుత్వ సంస్థల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యతనివ్వడంతో అధికశాతం విద్యార్థులు ట్రీపుల్‌ఐటీ వైపు దృష్టిపెడుతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల తలిదండ్రులు ట్రీపుల్ ఐటీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయపడుతుంటారు. చిన్న పొరపాట్లతో చేజేతులార సీట్లు కోల్పోవడం చూస్తునే ఉంటాం. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోనే విధానం ‘సాక్షి’ మీకోసం అందిస్తోంది. వసతులు.. విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలతోపాటు రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు తదితర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రిపుల్ఐటీ అధికారులు కోరారు. జత చేయాల్సిన పత్రాలు.. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రాలు, వికంలాగులైతే వైకల్య ధ్రువీకరణపత్రం, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. ఫీజుల వివరాలు.. రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఏడాది రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సి అవసరం లేదు. రిజిష్టేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. క్యాష్ డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2000 చెల్లించాలి. (దీనిని తిరిగి ఇస్తారు). ఇతర రాష్ట్రాల, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.36 ల„ýక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3 లక్షల ట్యూషన్ ఫీజు చెల్లించాలి . అర్హతలు.. అభ్యర్థులు ప్రథమ ప్రయత్నంలో 2019–ఎస్ఎస్సీ, తత్సామాన పరీక్షల్లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2019 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. దరఖాస్తు విధానం.. అభ్యర్థులు ఈ–సేవా లేదా మీ–సేవా కేంద్రాల ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. దరఖాస్తు ఫీజుతోపాటు సర్వీసు చార్జి కింద ఆన్లైన్లో అదనంగా రూ.25 చెల్లించాలి. అడ్మిషన్ల పద్ధతి.. పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒకే జీపీఏ ఉన్న అభ్యర్థులకు సబ్జెక్టు వారీగా పొందిన గ్రేడ్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రివేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. మోడల్, బాలికల, బాలుర పాఠశాల విద్యార్థులకు సైతం 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన విద్యార్థులకు ఇచ్చే వేయింటేజీగా పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 371 ఆర్టికల్–డీ, సెక్షన్–95/2014 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఆన్లైన్లో ఓటు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటుహక్కు పొందేందుకు మరో అవకాశం లభించింది. ఈసారి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే.. సరిపోతుంది. గతంలో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారా..? ఓటు రాలేదా...? పేరు, చిరునామాలో మార్పు సమస్య పరిష్కారం కాలేదా..? మీరంతా నిశ్చింతంగా ఉండి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ (వచ్చే నెల) 12వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేవరకు గడువునిచ్చింది. అర్హులు ఆన్లైన్లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. వీటిని పరిశీలించి అర్హులకు త్వరితగతిన ఓటునందించే అవకాశముంది. డిసెంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటేయొచ్చు. నిత్యం ఓటు నమోదుకు చాన్స్..కానీ.. ఏడాదిలో 365రోజులు 24గంటల పాటు ఓటు నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వచ్చే నెల 12వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశమిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు అనివార్య కారణాలతో ఎన్నికల సంఘం 12వ తేదీ వరకు గడువునిచ్చినట్లు తెలుస్తోంది. అందరూ కూడా గత నెల 25వ తేదీ వరకే ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందనే అపోహలో ఉన్నారు. అయితే వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించనుంది. ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంకా ప్రచారం కల్పించట్లేదు. త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం), ఓటర్ వెరిఫయిడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీ ప్యాట్)పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఓటు నమోదుపై కూడా ప్రచారం కల్పించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. ఓటర్లు పెరిగే అవకాశం.. సెప్టెంబర్ 10వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కాగా..కొత్త ఓటర్లుగా, మార్పులు, చేర్పులకోసం గత నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఫారం 6, 7, 8, 8ఏ వివిధ కేటగిరీలకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ)ల ద్వారా 59,186దరఖాస్తులు రాగా, ఆన్లైన్లో 19,566 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటినీ పరిశీలించిన అధికార యంత్రాంగం ఆ సమస్యలను పరిష్కరించారు. తాజాగా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. జిల్లాలో ఇప్పటివరకు 10,54,805మంది ఓటర్లు గా ఉండగా పురుషులు 5,18,681మంది ఉన్నారు. మహిళలు 5,36,053మంది ఉండగా ఇతరులు 71 మంది ఉన్నారు. జిల్లాలో వచ్చే నెల 12వ తేదీ వరకు ఓటరు దరఖాస్తులు, మార్పులు చేర్పులకు అవకాశం ఉండగా త్వరలో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశముంది. నమోదు ప్రక్రియ ఇలా.. ఫారం 6: కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 7: అభ్యంతరాల తొలగింపునకు ఫారం 8: వివరాలు సరి చేసుకునేందుకు ఫారం 8ఏ: ఓటర్ల జాబితాలో పేరును మరో చోటుకు మార్చుకునేందుకు. -
ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సాధ్యమేనా?
న్యూఢిల్లీ: ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా తమ ఇళ్ల నుంచే కంప్యూటర్ల ద్వారా ఈ–ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చా? అని లా కమిషన్‌ను కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. తమకు అందిన సమాచారం కేసు పెట్టదగినదే అయితే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ–ఎఫ్ఐఆర్పై అభిప్రాయాన్ని చెప్పాలని లా కమిషన్‌ను హోంశాఖ కోరింది. ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా ఇంటి నుంచి ఫిర్యాదు చేయాలంటే సీఆర్పీసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని కమిషన్ సూచించింది. ఈ విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన బాధ తప్పుతుందని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు తప్పుడు అభియోగాలు చేసేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు దుర్వినియోగం చేసే అవకాశముందని హెచ్చరించింది. -
‘స్వగృహ’కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్రభుత్వం నిర్ధారించిన రాయితీ ధరలకు కొనుగోలు చేసుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ బండ్లగూడలో గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లకు చదరపు అడుగుకు రూ.1,900, కొంత అసంపూర్తిగా ఉన్న వాటికి రూ.1,700, పోచారం వెంచర్లో రూ.1,700, రూ.1,500లుగా ధర నిర్ణయించినట్టు వెల్లడించారు. బండ్లగూడలో 2,245 ఇళ్లకుగాను 316 ఇళ్లు, పోచారంలో 1,474 ఇళ్లకుగాను 969 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. స్వగృహ అప్పుల్లో తెలంగాణ వాటా రూ.వేయి కోట్లకుపైగా ఉండేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.820 కోట్లు తీర్చిందని వెల్లడించారు.