- మండల, డివిజనల్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు: ప్రభుత్వ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణ మాఫీకి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం మండల, డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. గురువారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రుణ మాఫీకి అర్హులై ఉండి తొలి విడత జాబితాలో పేర్లు లేని వారి నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆర్థికశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రుణ విముక్తి జాబితాలో పేర్ల నమోదు పరిశీలన కోసం రైతులు ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో http://125.21.84.139/ ద్వారా ఫిర్యాదులు చేసుకోవాలి. వారు అందుకు సంబంధించిన ఆధారాలను ఎమ్మార్వో నేతృత్వంలోని కమిటీకి సమర్పించాలి.
ఫిర్యాదులను వడపోసి అర్హులను నిగ్గుతేల్చేందుకు మండల స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి మండల రెవెన్యూ అధికారి .. నోడల్ అధికారి లేదా కన్వీనరుగా ఉంటారు. సంబంధిత బ్యాంకు బ్రాంచి మేనేజరు, మండల వ్యవసాయ అధికారి సభ్యులుగా ఉంటారు.
ఆ కమిటీ నిర్ణయాలపై రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) నేతృత్వంలోని అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఈ కమిటీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంది.
అంతిమంగా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఉంటుంది. ఈ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఖరారవుతుంది. జిల్లా కమిటీలో కలెక్టరు/ సంయుక్త కలెక్టరు, జిల్లా లీడ్ మేనేజరు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు తదితరులు ఉంటారు.
కాల్ సెంటర్ నంబర్ 1800 103 2066
రుణమాఫీ సమాచారంకోసం రైతులు 1800 103 2066 నెంబర్‌కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారు నిబంధనల ప్రకారం వచ్చే నెల 9వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదుతో పాటు స్టాంపుల్లేని అఫిడవిట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ‘అప్లికేషన్ కమ్ అన్‌స్టాంప్‌డ్ అఫిడవిట్’ నమూనాను కూడా జీఓలో జారీ చేసింది.