రెవెన్యూ చట్టాలపై చర్చ జరగాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ రెవెన్యూ చట్టాలపై సమగ్ర చర్చ జరగాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సూచించారు. అసైన్డ్, భూదాన భూములు, ఆర్‌వోఆర్, భూసంస్కరణల చట్టం, కౌల్దారు తదితర అంశాలున్నందున తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయిదెకరాల లోపు సాదా బైనామాలను ఉచితంగా రిజిస్టర్ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడం సరికాదన్నారు. వివాదాస్పద, బోగస్ భూములు ఉన్నందున.. రాజకీయ పార్టీలు, నిపుణులతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. మంగళవారం మఖ్దూం భవన్‌లో ఆ పార్టీ సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డితో కలసి చాడ విలేకరులతో మాట్లాడారు.
జూన్ 2న పార్టీ కార్యాలయంలో రాష్ర్ట అవతరణ ఉత్సవాలు, అదేరోజు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ ప్రగతిరథం స్పీడెంత’ అంశంపై సదస్సు నిర్వహిస్తామన్నారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్షాలు రాజకీయ స్వయ్రోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ డైవర్షన్ స్కీం రాజుకుంటున్నదని, ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు, కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.