జెడ్పీ ఖాళీల్లో ఇతర విభాగాల వారిని నియమిస్తున్నారంటూ నిరసన
జెడ్పీ ఉద్యోగుల పెన్‌డౌన్ నేడు మహా ధర్నా
హన్మకొండ : జిల్లా పరిషత్ పోస్టులలో పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులను నియమించడాన్ని నిరసిస్తూ జెడ్పీ ఉద్యోగులు మంగళవారం ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో జిల్లా పరిషత్‌లో సేవలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా జెడ్పీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్)ల పరిధిలో డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లోని మినిస్టీరియల్ పోస్టులన్నీ జెడ్పీ ఉద్యోగులతోనే భర్తీ చేయాలనే నిబంధనలను పర్యవేక్షక ఇంజినీర్లు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
వారి విభాగాలకు చెందిన సిబ్బందినే జెడ్పీ పోస్టులలో నియమిస్తుండటంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఉన్నతాధికారుల వైఖరిని నిరసిస్తూ బుధవారం(నేడు) జెడ్పీ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, సాదుల ప్రసాద్, నయూముద్దీన్, సీ.హెచ్.రమేష్, రవికుమార్, అబ్దుల్లా, మోహనకృష్ణ పాల్గొన్నారు.