
'నీది నోరా.. మోరీనా, నోరు అదుపులో పెట్టుకో'
హైదరాబాద్: తెలంగాణ బీఏసీ సమావేశంలో నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం బీఏసీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా బీఏసీ సమావేశానికి టీడీపీ సభ్యుల హాజరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని బీఏసీకి ఆహ్వానించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అయితే గతంలో తమ పార్టీ నుంచి ఇద్దరు సభ్యులకు బీఏసీలో పాల్గొనే అవకాశం ఇస్తామని చెప్పారని ఎర్రబెల్లి దయాకరరావు గుర్తు చేశారు. అందుకు తగ్గట్లే ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి పట్టుబట్టగా అందుకు కేసీఆర్ నిరాకరించారు. సభను ఎలా నడపాలో తమకు తెలుసునని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకు సభలో ఎలా వ్యవహరించాలో తమకూ తెలుసునని రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వగా, బడ్జెట్ కూడా వినే ఓపిక లేనివారికి సభ ఎన్ని రోజులు ఉంటే ఎందుకు? అని కేసీర్ ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి .... నీది నోరా, మోరీ యా అంటూ కేసీఆర్పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అందుకు కౌంటర్గా కేసీఆర్ కూడా లేచి, ఎర్రబెల్లిని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. గొడవ తారస్థాయికి చేరటంతో కాంగ్రెస్ నేత జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.