సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో నీటివృథాను, ట్యాంకర్ల అక్రమాలను నిరోధించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది. నూతన సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ట్యాంకర్లలో నీటిని నింపే ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పాస్ వాటర్ స్కాడా అనే సంస్థ రూపొందించిన ట్యాంకర్ వాటర్ డిస్పెన్సర్ (ట్యాంకర్ ఏటీఎం) యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జలమం డలి పరిధిలోని వెయ్యి ట్యాంకర్లకు నీటిని ఫిల్లింగ్ చేసేందుకు 56 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో రోజువారీగా సుమారు వెయ్యి ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయి. ప్రతీ ట్యాంకర్ ఒక ట్రిప్పునకు ఐదువేల లీటర్ల చొప్పున నిత్యం 5 ట్రిప్పుల మేర నీటిని సరఫరా చేస్తోంది. గృహ, వాణిజ్య వినియోగదారులతోపాటు నీటి సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాలు, కలుషిత జలాల సమస్య ఉన్న ప్రాం తాలకు ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి.
గృహ అవసరాలకు రూ.500, వాణిజ్య అవసరాలకు రూ.850 చొప్పున జలమండలి వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తోంది. కొందరు ట్యాం కర్ యజమానులు ఫిల్లింగ్ కేంద్రాల్లో ఒక ట్రిప్పు నకు డబ్బులు చెల్లించి రెండు అంతకంటే అదనపు ట్రిప్పుల మేర నీటిని తరలిస్తున్నట్లు ఆరోపణలు న్నాయి. ట్యాంకర్ వాటర్ ఏటీఎం ద్వారా ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని, తాగునీటి వృథాను అరికట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు.
ట్యాంకర్ ఏటీఎం పనిచేస్తుందిలా..
ట్యాంకర్ ఏటీఎం యంత్రం వినియోగం ఏటీఎం తరహాలోనే ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ.2.5 లక్షలు. ట్యాంకర్ యజమానికి జారీ చేసే కార్డును ఈ యంత్రంపై తాకడం ద్వారా ఇది పనిచేస్తుంది. ముందుగా కార్డులో రీచార్జ్ చేసిన మొత్తం నుంచి ట్యాంకర్‌లో తరలించే నీటికి సం బంధించి ట్రిప్పులవారీగా నిర్ణీత మొత్తం కోత పడుతుంది.
ఇక ఫిల్లింగ్ కేంద్రంలో నీటిని నింపుకునేందుకు ప్రతీసారి విధిగా ఈ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. కార్డును తాకిన తరవాత నిర్ణీత పాస్‌వర్డ్‌ను సైతం ఈ యంత్రంలో టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు ట్యాంకర్‌లో నిర్ణీత మొత్తంలో నీటిని నింపేందుకు ఆస్కారముంటుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడడమే కాకుండా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షకుల అవసరం కూడా ఉండదని జలమండలి అధికారులు చెబుతున్నారు.
నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జల వనరుల నుంచి జలమండలి మహానగరానికి తాగునీటిని తరలిస్తోంది. ప్రతీ వెయ్యి లీటర్ల నీటిశుద్ధికి రూ.45 ఖర్చు చేస్తున్నప్పటికీ వినియోగదారులకు రూ.10కే సరఫరా చేస్తున్నాం.
అంతర్జాతీయ ప్రమాణాల మేరకు నగరంలోని ప్రతీ వ్యక్తీకి నిత్యం 135 లీటర్ల తాగునీటిని(లీటర్ పర్ క్యాపిటా డైలీ) సరఫరా చేస్తున్నాం. ట్యాం కర్ల అక్రమాలతో తాగునీరు వృథా కాకుండా కాపాడటంతోపాటు వినియోగదారులకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు నూతన సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నాం. నీటి వృథా, చౌర్యాన్ని నిరోధించేందుకు ఈ వాటర్ డిస్పెన్సర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. –ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment