వాటర్..బెటర్
- జూలై వరకు మంచినీటికి ఢోకా లేదు..
- సంతృప్తికరంగా జలాశయాల నీటి మట్టాలు
- ఖుషీ అవుతున్న జలమండలి అధికారులు
సాక్షి,సిటీబ్యూరో: మహానగర వాసులకు శుభవార్త. వేసవిలో ఇక తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పన్లేదు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు నగరానికి తాగునీటిని అందిస్తున్న జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్(గండిపేట) సహా కృష్ణా,మంజీరా,సింగూరు జలాశయాల్లో నీటినిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయి. దీంతో జూలై వరకు నీటికి ఇబ్బందులు ఉండవని, సరఫరా సక్రమంగా ఉంటుందని వాటర్‌బోర్డు ట్రాన్స్‌మిషన్ విభాగం చీఫ్ జనరల్‌మేనేజర్ (సీజీఎం) విజయ్‌కుమార్‌రెడ్డి గురువారం ‘సాక్షి’కి తెలిపారు.
సాధారణంగా వేసవిలో నీరు ఆవిరికావడం, వాడకం ఎక్కువగా ఉండడంవల్ల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతాయని, కానీ ఈ ఏడాది అలాంటి ఇబ్బందుల్లేవని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో రోజువారీగా 340 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. నీటినిల్వలు సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో ఈ వేసవిలో జంటజలాశయాలు,సింగూరువద్ద అత్యవసర పంపింగ్ ఏర్పాట్లు అవసరం ఉండదని స్పష్టం చేశారు. జూలైలో సకాలంలో రుతుపవనాలు సమీపించి వరుణుడు కరుణిస్తే జలాశయాల్లో నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.
ప్రస్తుతం కరెంటు కోతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అరకొరగా,ఆలస్యంగా మంచినీటి సరఫరా జరుగుతున్నా, సమస్యను పూర్తిగా అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్‌లోనే వర్షాలు వచ్చి జలాశయాలు పూర్తిగా నిండితే అన్ని ప్రాంతాలకు సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.