గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు
నార్నూర్, న్యూస్‌లైన్ : మండలంలోని గిరిజన, దళిత గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లోని రక్షిత నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. గ్రామస్తులు కిలో మీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బావులు, చెలిమెలను ఆశ్రయిస్తూ రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా పల్లెల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
ఇరవై ఏళ్లుగా ఇంతే..
మండలంలోని పిప్రీ గ్రామ పంచాయతీని అధికారులు దత్తత గ్రామంగా ప్రకటించారు. గ్రామపంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. వేసవి కావడంతో ప్రస్తుతం గ్రామస్తులు తాగునీటికి అల్లాడుతున్నారు. వాగులు, చెలిమెల్లోంచి తెచ్చుకున్న నీటిని తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. పిప్రితోపాటు పంచాయతీ పరిధిలోని కొలాంగూడ, అంద్‌గూడ, గోండుగూడ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలవారు ఇరవై ఏళ్లుగా తాగునీటికి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఏటా ఐటీడీఏ ద్వారా రూ.లక్షలు వెచ్చిస్తున్నా అధికారులు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
అధికారులకు తెలిపినా..
గ్రామంలో ఒక రక్షిత నీటి పథకం, మూడు గూడేలకు కలిపి ఐదు చేతిపంపులున్నాయి. రక్షిత నీటి పథకం నిర్వహణ సరిగా లేక వాటర్ ట్యాంక్ నిరుపయోగమైంది. బిందెడు తాగునీటికి గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలోని వాగులు, చెలిమెల వద్దకు వెళ్తున్నారు. మండలంలోని రోమన్‌కాసా, సాంగ్వి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగునీటి కోసం మూడు కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఈ గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో అధికారులకు నీటి సమస్య గురించి తెలిపినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఏళ్లకేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి నిత్యం పాట్లు పడుతూనే ఉన్నారు.
రోగాల పాలవుతున్న జనం..
రక్షిత నీటి పథకాలు పని చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ బావులు, వాగులు, చెలిమే నీళ్లు తాగిన ప్రజలు రోగాల పాలవుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు తరచూ దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని నీటి వనరులను పరిశీలించి, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.