కన్నీళ్లు..
♦ పల్లెలు గొల్లుమంటున్నాయ్..
♦ చుట్టూ నీళ్లున్నా.. రోజూ ఇక్కట్లే
♦ ఎడారిగా మారుతున్న మంజీర తీరం
♦ వట్టి పోతున్న తాగునీటి పథకాలు
♦ నిద్రావస్థలో అధికారులు
మెదక్ : మెతుకుసీమ ప్రజలకు సాగు, తాగునీటి ఆధారం మంజీర నది. డివిజన్ కేంద్రమైన మెదక్ నియోజకవర్గంలో 30 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న ఈ నదిపై పాపన్నపేట మండలం కొడుపాక, కొత్తపల్లి, పొడ్చన్‌పల్లి, మెదక్ మండలం జక్కన్నపేట ప్రాంతాల్లో సీపీడబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు ద్వారా 40 గ్రామాలకు తాగునీరందిస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షం పడకపోవడంతో కొడుపాక పథకం త ప్ప, మిగతావన్నీ మూతపడేస్థితికి చేరాయి. మరోపక్క బోర్లలో నీటిమట్టం తగ్గిపోతుండటంతో సుమారు 20 శాతం గ్రామాలు నీటికి కటకటలాడుతున్నాయి.
రోజూ కనీసం ఒక్కొక్కరికి 40 లీటర్ల తాగునీరు అందించాల్సిన అధికారులు కనీసం నాలుగు లీటర్లు కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నారు. సీఆర్‌ఎఫ్ నిధులు రూ.30లక్షలు, నాన్ సీఆర్‌ఎఫ్ నిధులు రూ.2.30 కోట్లు మంజూరైనా.. అందులో సగం కూడా వెచ్చించనట్టు తెలుస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలకు వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధులను కూడా తాగునీటి సౌకర్యం కోసం వినియోగించక పోవడంతో రోజు రోజుకూ సమస్య తీవ్రమవుతోంది.
అన్నారం.. తాగునీటికి జాగారం
పాపన్నపేట మండలం అన్నారంలో 70 శాతం మందికి నీరందడం లేదు. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న బోరుబావిలో నీటిమట్టం తగ్గిపోవడంతో జనం గొంతు తడవడం లేదు. ముత్తరాసివాడలో చేతిపంపులో నీళ్లున్నా.. హ్యాండిల్, సింగిల్‌ఫేస్ మోటర్ బిగించక పోవడంతో సమస్య తీవ్రమైంది. దీంతో రెండురోజులకోసారి స్నానాలు చేస్తున్నామని, వారానికోసారి బట్టలు ఉతుక్కుంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సర్పంచ్ పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామ మహిళలంతా శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రెండ్రోజుల్లో సమస్య తీర్చకుంటే తాగునీటి ట్యాంకులను కూల్చివేస్తామని హెచ్చరించారు.
మెదక్ టౌన్‌లో నీటికి కటకట
మెదక్ పట్టణ ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. పట్టణంలో నాలుగు నెలలుగా రెండ్రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. 80 వేల జనాభా కలిగిన పట్టణానికి రోజూ 4.20 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కానీ, సరఫరా 2.50 లక్షల లీటర్లకు మించడం లేదు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ఆరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. 65 సింగిల్‌ఫేస్ మోటర్లు, 5హెచ్‌పీ 40 మోటర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్టు ఇంజనీర్ చిరంజీవులు చెబుతున్నారు. వ్యవసాయ బోరుబావులను సైతం అద్దెకు తీసుకొని నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
గొంతెండుతోన్న ‘మండలం’
మెదక్ మండల ప్రజలకు తాగునీరందించే పైలట్ పథకానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి రెండునెలలవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. మండలంలో 35 గ్రామ పంచాయితీలు, 17 శివారు గ్రామాలున్నాయి. మండలానికి నీటి సరఫరా నిమిత్తం 2008లో రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో సర్దన శివారులోగల మంజీర నదిలో ఇంటెక్‌వెల్‌ను నిర్మించి నది ఒడ్డున సంప్‌హౌస్‌ను కట్టి, జక్కన్నపేట, హవేళిఘణపూర్ శివారుల్లో హెడ్‌ఓవర్ ట్యాంకులను నిర్మించారు. మంజీర నుండి పైపులైన్ల ద్వారా పలు గ్రామాల్లోని వాటర్‌ట్యాంకులకు నీటిని సరఫరా చేసి ప్రజలకు తాగునీటికి అందిస్తున్నారు. ఇందుకోసం సర్దన సబ్‌స్టేషన్ నుండి నీటిపథకం వరకు డెరైక్టు (హెచ్‌టీ) కరెంట్ లైన్‌ను మంజీర నది వరకు వేసి మోటార్లను నడుపుతున్నారు. 2 నెలల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పరిస్థితిని చక్కదిద్దడం లేదు.
లాక్యతండా.. నీళ్ల కోసం తండ్లాట
రామాయంపేట మండలం పర్వతాపూర్ పంచాయితీ పరిధిలోని లాక్యా తండాలో నీటి సరఫరా ట్యాంకు నిర్మాణంతో పాటు పైపులైను వేయడానికి, బోరు తవ్వకానికి గతంలో రూ.8 లక్షల వరకు ఖర్చుచేశారు. కొన్నాళ్లు బాగానే నడిచినా.. అనంతరం పైపులైను శిథిలం కావడం, ట్యాంకుకు నీరు సరఫరా చేసే బోరులో నీరు అడుగంటడంతో కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుక్కెడు నీటి కోసం రేయింబవళ్లు వ్యవసాయ బోర్ల చుట్టూ తిరుగుతున్నామని తండావాసులు అంటున్నారు. కరెంట్ లేకుంటే ఆపాటి నీళ్లూ దొరకడం లేదని వాపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో స్పందించడం లేదంటున్నారు.
జంగరాయిలోనూ అంతే..
చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంతో పాటు మరో మూడు తండాలు, ఎస్సీ కాలనీ ప్రజలు తాగునీటి కోసం అగచాట్లు పడుతున్నారు. మూడు తండాలకు కలిపి ఎర్రగుంట తండాలో రక్షిత నీటి ట్యాంకు ఉంది. గ్రామంలో మంచినీటి బోరుబావులు వట్టిపోవడంతో నీళ్లు ట్యాంకులో పడడంలేదు. దీంతో త్రీఫేజ్ విద్యుత్ సరాఫరా ఉన్నప్పుడే గ్రామంలో మంచినీటి సరఫరా జరుగుతోంది. అన్ని గ్రామాలలో మాదిరి ఇక్కడ ఇంటికి నల్లా నీరు అందడంలేదు. ఫలితంగా అంతా వీధి నల్లా వద్ద క్యూ కడుతున్నారు. కొన్నిసార్లు ఘర్షణలూ చోటుచేసుకుంటున్నాయి.