బండరాళ్లు, మురికి నీళ్ల మధ్య ప్లేట్లు కడుక్కుంటున్న వీరంతా స్కూలు పిల్లలు. బడిలో 1,350 మంది చదువుతున్నా ఉన్నది ఒకే ఒక్క బోరు. అందులోంచి సరిపడ నీళ్లు రావడం లేదు. దీంతో స్కూలు ప్రహరీ గోడ దూకి పక్కనే ఉన్న పబ్లిక్ కుళాయి వద్దకు వెళ్లి ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఇక్కడ బాలురు, బాలికలు, ప్రాథమికోన్నత పాఠశాల.. మూడు ఒకే ఆవరణలో కొనసాగుతున్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు! – సాక్షి, హైదరాబాద్
అన్ని బడుల్లో ఇదే దుస్థితి
రాష్ట్రంలో అనేక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. స్కూళ్ల సమస్యలపై తక్షణమే స్పందించాలని సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు చెబుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. రక్షిత తాగునీటి కోసం విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నా కదలడం లేదు. ఏటా రూ.11 వేల కోట్ల బడ్జెట్. అందులో మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ.3 వేల కోట్లు. అయినా విద్యార్థులకు రక్షిత తాగునీటి సదుపాయాన్ని విద్యాశాఖ కల్పించలేకపోతోంది.
రాష్ట్రంలో 25 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. అందులో 10,768 స్కూళ్లకే నీటి సదుపాయం ఉంది. 14,763 పాఠశాలలకు నీటి సదుపాయం లేకపోవడంతో పిల్లలకు కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు ప్రతిరోజు ఇంటి నుంచి తాగునీటి బాటిళ్లను తీసుకెళ్లాల్సి వస్తోంది. కొన్ని స్కూళ్లలో చేతిపంపులు ఉన్నా వాటిల్లో వచ్చే నీటిని విద్యార్థులు తాగలేని పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల మురికిగా ఉంటున్నా ఆ నీళ్లనే తాగుతుండటంతో అనారోగ్యం పాలవుతున్నారు.
భద్రాద్రిలో అత్యధికం
ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు కాదు కదా కనీసం విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి నీరు లేని స్కూళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. ఆ జిల్లాలో 1,047 పాఠశాలలు ఉండగా 824 పాఠశాలల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సదుపాయం లేదు. ఈ కోవలో తర్వాతి స్థానంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 786, సంగారెడ్డి జిల్లాలో 769 స్కూళ్లున్నాయి.
తాగునీటి కష్టాలు.. మచ్చుకు కొన్ని..
♦ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్ మండలంలోని మాధ్వార్ ప్రాథమిక పాఠశాలలో 210 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ మూడు నెలల కిందట బోరు పాడైనా ఇప్పటికీ బాగు చేయకపోవడంతో విద్యార్థులు తంటాలు పడాల్సి వస్తోంది. ఎలిగండ్ల, కన్మనూర్ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
♦ పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలోని కేజీబీవీలో వాటర్ ఫిల్టర్ రెండు నెలలుగా మొరాయించటంతో విద్యార్థులకు తాగునీటికి ఇబ్బంది పడ్డారు. దీంతో పాఠశాల ప్రిన్సిçపల్ బయట ఫిల్టర్ వాటర్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు.
♦ జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు రక్షిత తాగునీరు అందించే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం అన్ని స్కూళ్లకు జలమణి ప్లాంట్లు అందించింది. అయితే ఇవి ఎక్కడా పనిచేయడం లేదు. మరమ్మతు చేయకపోవడంతో మూలన పడేశారు.
♦ నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఇటిక్యాలలోని ప్రాథమిక పాఠశాలలో నీటివసతి లేక విద్యార్థులు ఇంటి నుంచే నీళ్లను తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు.
♦ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో మాచవరం, శ్రీనివాసపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో రక్షిత తాగు నీటి పథకాలు లేవు. చేతిపంపు నీటిని తాగాల్సి వస్తోంది. దీంతో పిల్లలు అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నారు.
మూడుసార్లు బాటిళ్లు నింపుకొస్తాం
పాఠశాలలో తాగునీరు లేక ఇంటి నుంచి బాటిళ్లలో తెచ్చుకుంటాం. రోజూ ఉదయం, ఇంటర్‌వెల్‌తోపాటు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత బాటిళ్లలో నీళ్లు నింపుకొని వస్తున్నాం. నీళ్లకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సునీత, ఆరో తరగతి, బండగొండ, మహబూబ్‌నగర్ జిల్లా
బోరునీళ్లు చిలుము వాసన వస్తున్నాయి
మా స్కూల్లోని బోరులో నీళ్లు తుప్పు వాసన వస్తున్నాయి. వాటిని తాగలేకపోతున్నాం. ఇంటి దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతోంది. – బి.నాగేశ్వరి, ఐదో తరగతి, యూపీఎస్ శ్రీనివాసపురం, హుజూర్‌నగర్ మండలం, నల్లగొండ జిల్లా
నీటి సమస్య తీర్చాలి
మా పాఠశాలలో బోరుబావి ఎండిపోయింది. మధ్యాహ్న భోజనం సమయంలో తాగేందుకు నీళ్లను ఇంటినుంచే తెచ్చుకుంటున్నాం – రవి, పదోతరగతి, బొమ్మెన, కథలాపూర్ మండలం, జగిత్యాల