నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో పాటు ఎత్తిపోతల పథకాలైన లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీ కాల్వలకు కూడా మంత్రులు సాగునీరు విడుదల చేశారు.
శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ వేగంగా నిండుతోంది. శ్రీశైలం డ్యాంలోకి వరద ప్రవాహం భారీగా ఉండడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 7,86,752 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో కాలువలకు నీటిని విడుదల చేశారు. దీనిపై మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవసాయానికి నీటి విడుదల చేశామని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలతో సహజ వనరుల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిని కలుపుకు పోతున్నారని అభిప్రాయపడ్డారు.
ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలకు మేలు చేకూరే విధంగా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్‌ను పెద్దన్నలా భావించి రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేకూరేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకునే విధంగా పరస్పర సహకారంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమాంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment