కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి మీదుగా జలమార్గం ఏర్పడనుంది. నీటిలోతు సుమారు వందమీటర్లు ఉంటేనే లాంచీలో ప్రయాణం సాధ్యమవుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మితమైతే ఆ మేరకు నీరు నిల్వ చేయవచ్చు. రోడ్డు, రైలుమార్గం కంటే జలమార్గం ద్వారా ప్రయాణికులకు దూరం తగ్గుతుంది. పేరంటాలపల్లి, పాపికొండలు వంటి పర్యాటక ప్రాంతాలను చూసే వీలవుతుందని సర్వే అధికారులు నిర్ధారించారు.
2012లో ఐడబ్ల్యూఏఐ (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సంస్థ చీఫ్ శ్రీవాత్సవ రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో ప్రయాణించి జలమార్గాన్ని పరిశీలించారు. అదేఏడాది రెండుసార్లు జలమార్గం కోసం సర్వే నిర్వహించారు.
2013లో ఢిల్లీ, నోయిడాలోని ప్రభుత్వరంగ సంస్థ ఐడబ్ల్యూఏఐ సర్వే నిర్వహించింది. ఆ తర్వాతహైదరాబాద్‌కు చెందిన ఐఐసీ (ఇంటెలిజన్ ఇన్ఫర్మేషన్ కన్వర్షన్) అనే కాంట్రాక్టు సంస్థ అధికారులు కూడా సర్వే చేశారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు మండల పరిధిలోని వింజరం రేవు మీదుగా సర్వే నిర్వహించిన అధికారులు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా నీటిలోతు, నది ఒడ్డు కొలతలను నమోదు చేసుకున్నారు.
భద్రాచలం బ్రిడ్జి నుంచి రాజమండ్రి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి వరకు గోదావరి 157 కిలో మీటర్లు, నది ఒడ్డు 171కి.మీ ఉందని అప్పట్లో సర్వే చేసిన ఐఐసీ అధికారులు తేల్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోచవరం, పాపికొండలు వద్ద 59 మీటర్లు, కచ్చులూరు వద్ద గోదావరిలో 60 మీటర్ల లోతు ఉంది. కుక్కునూరు మండలం వింజరంలో ఆరు మీటర్ల లోతే ఉందని నిర్ధారించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆ లోతు సుమారు వందమీటర్లకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భద్రాచలం నుంచి చింతూరు మీదుగా రాజమండ్రికి రోడ్డు ప్రయాణం 209 కి.మీ, భద్రాచలం నుంచి కుక్కునూరు మీదుగా రాజమండ్రికి 185 కి,మీలు ఉంది. జలమార్గం ద్వారా ఆ దూరం 157 కి. మీ.లకు తగ్గుతుంది. దీనిద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని, ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని సర్వే అధికారులు పేర్కొన్నారు. పేరంటాలపల్లి, పాపికొండల యాత్రికులకు ఇది కలిసివస్తుందని అభిప్రాయపడ్డారు.
రవాణాకు పోలవరం
Published Mon, Jul 7 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement