'చీప్ లిక్కర్ పాలసీకి మేం వ్యతిరేకం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చీప్ లిక్కర్ పాలసీని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి పోరాడాలని టీపీసీసీ నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చీప్ లిక్కర్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
అదే విధంగా జాతీయ హోదా వచ్చే అవకాశమున్న ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చరాదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే వాటర్ గ్రిడ్ పథకం అవసరం లేదని తెలిపారు. వాటర్ గ్రిడ్కు రూ.36వేల కోట్లు వెచ్చించడం ఆర్థిక భారమేనని పేర్కొన్నారు. కొన్ని పైప్లైన్ల కంపెనీలు, కాంట్రాక్టర్ల కోసమే వాటర్ గ్రిడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అనాలోచిన నిర్ణయాల వల్లనే మెట్రో రైలు ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా అన్నారు.