
అనుమానాలను తొలగించాం: కేటీఆర్
* అదే మా పెద్ద విజయం ‘మీట్ ది ప్రెస్’లో కేటీఆర్
* రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు
* ప్రపంచ ఐటీ దిగ్గజాలతో నేరుగా సంబంధాలు
* కొన్నేళ్లుగా దుర్భిక్ష పరిస్థితులతోనే రైతు ఆత్మహత్యలు
* పరిశ్రమలకు అనుమతుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా కోర్టుకెళ్లవచ్చు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సర్కారు ఏడాది పాలనలో ఆశించిన మేరకు సఫలీకృతమయ్యామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే నేల విడిచి సాము చేయకుండా, ప్రాధాన్యతలవారీగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేసుకున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, ఐటీ పరిశ్రమలు తరలిపోతాయని తీవ్రంగా వ్యతిరేకించిన మేధావులు సైతం ఇప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏడాది పాలనలో తమ సర్కారు సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని ‘హైదరాబాద్ ప్రెస్‌క్లబ్’ గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన వివరంగా మాట్లాడారు. ‘ఏడాదిలోనే రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించాం. సీఎం కేసీఆర్ ఇంట్లో, ఆఫీసులో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అనునిత్యం సమీక్షిస్తున్నారు. విద్యుత్ కోతలతో ఖరీఫ్ పంటలు ఎండి రైతు ఆత్మహత్యలు సంభవించడం, రబీలో పంటలు సగానికి తగ్గిపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకోవడం ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామాలు కావు. కొన్నేళ్లుగా దుర్భిక్ష పరిస్థితులే నెలకొన్నాయి. రైతు ఆత్మహత్యలు మాకు బాధ కలిగిస్తున్నాయి’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఐటీ ఇంక్యుబేటర్‌తో కొత్త కంపెనీలు
రాష్ర్టంలో ఐటీ కంపెనీల స్థాపనకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ‘ప్రపంచవ్యాప్తంగా మన ఐటీ నిపుణులకు మంచి పేరుంది. వాట్సప్, గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీలను మనవాళ్లూ నెలకోల్పేలా ప్రోత్సహించేందుకు 15 రోజుల్లో హైదరాబాద్‌లో ఐటీ ఇంక్యుబేటర్‌ను ప్రారంభిస్తున్నాం. గడిచిన మూడు నెలల్లో అమెరికా తదితర దేశాల పర్యటనల్లో 31 మందికిపైగా ఐటీ దిగ్గజాలను కలసి వారితో నేరుగా సంబంధాలేర్పరచుకున్నాం. రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. హార్డ్‌వేర్ పరిశ్రమలను ఆకర్షించేందుకు వచ్చే వారంలో తైవాన్, హాంకాంగ్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. త్వరలో ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానంలో మెగా పరిశ్రమలకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులివ్వనున్నట్లు చెప్పారు. ఒక్కరోజు ఆలస్యమైనా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై కోర్టులో దావా వేసుకోవచ్చునని పేర్కొన్నారు.
ఏపీ జనానికి జడిసే...
హామీలు నెరవేర్చనందుకు ఏపీ జనం తంతారనే ఆ రాష్ర్ట సీఎం చంద్రబాబు మహానాడును తెలంగాణలో పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కాగా, సీఎం కేసీఆర్ ఇంకా యువకుడే అని, మరో 30 ఏళ్ల దాకా ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని, వారసత్వంపై ఇప్పుడే మాట్లాడటం అనవసరమని మంత్రి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వల్లే వందలాది యువకులు చనిపోయారని, ఇదంతా రాయాల్సి వస్తుందనే చరిత్ర పాఠ్యాంశాల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరును ప్రస్తావించలేదని కేటీఆర్ పేర్కొన్నారు.