పదవ తరగతిలో వందశాతం ఫలితాలే  లక్ష్యం | We Targetted Hundred Percent In Tenth Class Said By DEO | Sakshi
Sakshi News home page

పదవ తరగతిలో వందశాతం ఫలితాలే  లక్ష్యం

Published Mon, Oct 21 2019 9:26 AM | Last Updated on Mon, Oct 21 2019 9:26 AM

We Targetted Hundred Percent In Tenth Class Said By DEO - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కొన్ని సంవత్సరాలుగా జిల్లా పదవ తరగతి ఫలితాల్లో 28వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది పక్కా ప్రణాళికను రచించి అందరి సహకారంతో జిల్లాను ముందంజలో నిలుపుదామని డీఈఓ ఉషారాణి కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా డీఈఓ ఉషారాణి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.  

టెన్త్‌ ఫలితాలపై శ్రద్ధ 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుటుంన్నాం. మరీ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్‌ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నిర్ణీత సమయంలో సిలబస్‌ పూర్తి చేసి, విద్యార్థులను ప్రిపరేషన్‌కు సిద్ధమయ్యేలా ఆదేశిస్తాం. సైన్స్, గణిత ఉపాధ్యాయులకు ఈనెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించి సబ్జెక్టుపై అవగాహన పెంచుతాం. 

విద్యానైపుణ్యాలు పెంచేలా చర్యలు  
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివిధ సబ్జెక్టు పరంగా నైపుణ్యాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా త్రీఆర్స్‌ కార్యక్రమం గతంలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఏబీసీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 60 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. వివిధ  సబ్జెక్టులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి అనేక రకాల అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. 

నాణ్యతగా మధాహ్న భోజనం 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి నాణ్యమైన భోజనం అందిం చే విధంగా చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా మెనూ పాటించేలా మండల విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత, శుభ్రతను పాటించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తాం.  

ప్రైవేటు విద్యా సంస్థలు తీరుమార్చుకోవాలి 
జిల్లాలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న వివిధ ప్రైవేటు సంస్థల వివరాలను, గుర్తింపు లేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారుల నుంచి సేకరిస్తాం. పూర్తి ఫీజులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకోవాల్సి ఉం ది. ఇక గుర్తింపు లేని పాఠశాలలకు గుర్తింపు తీ సుకునే విధంగా నోటీసులు జారీ చేస్తాం. పూర్తి స్థాయిలో సిబ్బంది, వసతులు, అనుమతుల గు రించి సమీక్షిస్తాం. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం.  

ఆ ఉపాధ్యాయులపై చర్యలు  
గతంలో పలువురు ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చిన విషయం గురించి తెలుసుకున్నాం. తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement