మంత్రి ‘పోచారం’పై అన్నదాతల్లో ఆశలు
ఒకప్పుడు అన్నపూర్ణగా వాసికెక్కిన ఇందూరు ఇప్పుడు వ్యవ‘సాయం’ కోసం ఎదురు చూస్తోంది. ఇతర ప్రాంతాల ఆకలి తీర్చిన జిల్లా ప్రస్తుతం మద్దతు ధర కోసం ఆందోళనలు చేయాల్సి వస్తోంది. పసిడి పంటగా ప్రసిద్ధి చెందిన పసుపు.. రైతుల ఇంట సిరులు కురిపించలేకపోతోంది. చెరుకు సాగు చేసిన కర్షకులకు చేదే మిగులుతోంది. సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. విత్తనాల కొనుగోలు నుంచే అన్నదాత కష్టాలు ప్రారంభమవుతున్నాయి. పంటను విక్రయించేంతవరకు అవి కంటిన్యూ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన రైతు బిడ్డ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అన్నదాతల కష్టాలు తెలిసిన పోచారం.. వ్యవసాయాన్ని పండుగ చేస్తారని భావిస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్ పనులకు సన్నద్ధమవుతున్నారు.
రెతన్నల పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. సకాలంలో విత్తనాలు, ఎరువులు, రసాయనాలు అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నారు. వీటికోసం రోజుల తరబడి సహకార సంఘాల వద్ద వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రైతులు మార్కెట్ లో విత్తనాలు, ఎరువులు కొనాల్సి వస్తోంది. వారు నకిలీవి అంటగడుతుండడంతో అన్నదాతలు మోసపోతున్నారు. విద్యుత్ అదనపు కష్టాలను తెచ్చిపెడుతోంది. చివరికి మద్దతు ధర లభించక నష్టాలే రాబడిగా వస్తున్నాయి.
విద్యుత్ కష్టాలు
జిల్లాలో ఎక్కువ మంది రైతులు బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో పాలకులు విఫలమవుతుండడంతో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. ఏడు గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని పాలకులు చెబుతున్నా.. వాస్తవానికి ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. అదీ ఒకే విడతలో ఇవ్వకపోవడంతో పారిన మడే మళ్లీ పారుతోంది. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. నాణ్యమైన విద్యుత్‌ను అందిం చాలని రైతులు కోరుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులు
జిల్లాలో నిజాంసాగర్, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలతోపాటు అనేక సాగునీటి కాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడిక తీయకపోవడమే కాక, దానిని మరమతు చేయడం లో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అలీసాగర్ ఎత్తిపోతల పథకం, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. కానీ ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు, మంత్రులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి మొదటికొచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
మార్కెట్‌యార్డులో అరకొర సౌకర్యాలే
తెలంగాణాలోనే అతి పెద్ద మార్కెట్‌యార్డు జిల్లా కేంద్రంలో ఉంది. సరిహద్దు జిల్లాల రైతులు పండించిన పసుపు, వరిధాన్యం, టంకర్(ఆమ్‌చూర్), మొక్కజొన్నలను ఇక్కడికి తరలించి విక్రయిస్తారు. ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనే కాదు కనీస వసతులు సమకూర్చడంలోనూ పాలకమండలి విఫలమైంది. దీంతో రైతుల సరుకుకూ భద్రత లేకుండా పోతోంది. వర్షాలు కురిస్తే పంట తడిసిపోవాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలతో వేలాది బస్తాల ధాన్యం, పసుపు కొమ్ములకు నష్టం వాటిల్లింది.
పాత ‘సబ్సిడీ’ అందించాలి
ప్రతి ఖరీఫ్ సీజన్‌లో వరితోపాటు సోయాబిన్‌ను అధికంగా సాగుచేస్తున్నారు. అవసరమైన విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. గతేడాది 33 శాతం రాయితీని విత్తనాల కొనుగోలుపై అందించారు. ఈ సబ్సిడీని 50 శాతానికి పెంచాలని వ్యవసా య శాఖ యోచిస్తోంది. అయితే గత సీజన్‌లో సబ్సిడీని నగదు బదిలీ ద్వారా అందించడంతో కొందరు రైతులు నష్టపోయారు.
నగదు బదిలీ విధానంలో సోయా విత్తనాల సబ్సిడీని అందించడాన్ని గతేడాది ఇం దూరులోనే ప్రథమంగా ప్రారంభించారు. 30 కిలోల సోయా విత్తనాల సంచికి రూ. 2,340 ధర నిర్ణయించారు. నగదు బదిలీ వల్ల రైతు లు మొత్తం ధర చెల్లించి విత్తనాలను కొనుగో లు చేశారు. విత్తనాలను అందించే సమయంలోనే రైతులు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇ చ్చారు. తర్వాత సబ్సిడీ మొత్తం రూ. 773ను రైతు ఖాతాలో జమ చేశారు. అయితే కొందరి కి మాత్రం సబ్సిడీ ఇప్పటికీ రాలేదు. సబ్సిడీ పొందిన రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో పొం దుపరచడంలో జరిగిన పొరపాట్ల వల్ల పలువురు రైతులు నష్టపోయారు. గత సీజన్‌కు సంబంధించిన సబ్సిడీ తమకు అందేలా చూ డాలని పలువురు రైతులు కోరుతున్నారు.
వ్యవసాయ పరికరాలు..
గతంలో వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందించేవారు. గతనెలనుంచి సబ్సిడీని ఎత్తివేశారు. మంత్రి స్పందించి వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ అందించేలా చూడాలి. భూ సారం పెంచడంతో జింక్ సల్ఫేట్ ఉపయోగపడుతుంది. వరి సాగు చేసే పొలాల్లో దిగుబడులు పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. జిల్లాకు సుమారు 500 మెట్రిక్ టన్నుల జింకు సల్ఫెట్ అవసరం అవుతుంది. అయితే ఇప్పటికి 100 మెట్రిక్ టన్నులు కూడా సరఫరా చేయలేదు.
ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పోచా రం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ మంత్రిగా బా ధ్యతలు స్వీకరించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కర్షకుల సమస్యలు తెలిసిన ఆయన వ్యవసాయానికి మేలు చేస్తారని వారు భావిస్తున్నారు. ప్రధానంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు పసుపు పంట పండిస్తారు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు, పసుపుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని, ప్రాజెక్టులు, కాలువలను ఆధునికీకరించాలని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
వ్యవసాయం చేస్తారా?
Published Sat, Jun 7 2014 1:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement