సినీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తాం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని, కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం చట్టాలను సవరిస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సినీ కార్మికులకు ఈ.ఎస్.ఐ భవిష్యనిధి (పీఎఫ్) సదుపాయాలు కల్పించాలని కోరుతూ నేషనల్ జాయింట్ కన్వీనర్ ఫర్ ఫిలిమ్స్, కల్చర్ త్రిపురనేని వరప్రసాద్ నేతృత్వంలో చిత్రరంగంలోని 24 కళల ప్రతినిధులు మంగళవారం కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయను కలిశారు.
తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 2 లక్షల మంది కార్మికులు చాలా పేదరికంలో బతుకుతున్నారని, వారందరికీ ప్రభుత్వం భరోసా కల్పించాలని మంత్రిని కోరారు. చట్టాలు సవరించైనా సరే సినీ రంగంలోని శ్రామికులకు మేలు చేస్తామని మంత్రి దత్తాత్రేయ హామీ ఇచ్చారు. సినీ కార్మికుడు మరణిస్తే రూ. 15 వేలు ఆపద్ధర్మంగా అందజేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు త్రిపురనేని తెలిపారు.