రంగారెడ్డి : తూనికలు,కొలతల శాఖ అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వంట నూనె ట్రేడర్స్ పై రెండురోజుల పాటు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 25 కేసులు నమోదు చేయడమే కాకుండా సుమారు రూ.15.27 లక్షల విలువగల నూనెను సీజ్ చేశారు. వంట నూనెలో కల్తీ జరుగుతున్నట్లు ప్రచారం గుప్పుమనడంతో రాష్ట్ర తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లోని వంట నూనె ట్రేడర్స్ పై గురు, శుక్ర వారాల్లో ఆకస్మికంగా దాడులు జరిపారు. నూనె ప్యాకింగ్‌లో తక్కువ తూకం, ప్యాకింగ్‌పై స్టిక్కర్, ఉత్పత్తి సంస్థ, తేదీ తదితర వివరాలు లేకపోవడం వంటి లోపాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో 10, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదు చేశారు.