- సంక్షేమ దరఖాస్తులు 12 లక్షలు పైనే...
- అధికారుల అంచనాలు తలకిందులు
- గడువులోగా విచారణ కష్టమే
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ‘సంక్షేమ’ దరఖాస్తులు అధికారుల అంచనాలకు మించి వచ్చాయి. ఇప్పటి వరకు పన్నెండు లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. ఆహార భద్రత కార్డుల కోసం సోమవారం నాటికి రేషన్ షాపుల్లోని కేంద్రాలకు 8 లక్షల 7వేల 872 దరఖాస్తులు వచ్చాయి. ఇక నిర్ణీత సమయంలో ఈ దరఖాస్తులను ఎంట్రీ చేయడం, లెక్కించటం, విచారణ చేపట్టడం కష్టమవుతుందని ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తంచేశారు. కాగా ప్రభుత్వం మొదట దరఖాస్తుల స్వీకరణకు సోమవారం వరకు గడువు విధించినప్పటికీ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
అంచనాకు మించి...
అంచనాలకు మించి నగరంలో సంక్షేమ పథకాల కోసం లక్షల్లో దరఖాస్తులు రావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డులు 6.24 లక్షలు ఉండగా ... తాజాగా దరఖాస్తులు మాత్రం 8,07,872 వచ్చాయి. అదేవిధంగా సామాజిక పెన్షన్లు 87 వేల 477 ఉండగా.. తాజాగా 1, 28,101 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ముందుగా పెన్షన్లు
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ముందుగా పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, విచారించవలసి ఉంది. వచ్చేనెల 8 నుంచి కొత్త వారికి పెన్షన్లు పంపిణీ చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉండటంతో అధికార యంత్రాంగం దృష్టిసారించింది.