మీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టింది! | What done your government! | Sakshi
Sakshi News home page

మీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టింది!

Published Thu, Oct 16 2014 11:50 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

What done your government!

కాంగ్రెస్ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్

సంగారెడ్డి క్రైం : అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమిటో ఆ పార్టీ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డి చెప్పాలని  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్రంలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పు బట్టారు. కాంగ్రెస్‌పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ పింఛన్లు ఎందుకు అందజేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ పాలనకు స్వస్తి చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే కావస్తోందని, ఇంత తక్కువ సమయంలోనే ఏమీ చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదన్నారు. చీటికిమాటికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు లేనిపోని విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందాయన్నారు.  ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడం వల్లనే ప్రజలు వైఎస్‌ను మరువలేకపోతున్నారన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

తమ సమస్యలు విన్నవించుకొనేందుకు వచ్చిన సత్యసాయి కార్మికులతో మంత్రి హరీష్‌రాావు వ్యవహరించిన తీరువల్లేనే సత్యసాయి కార్మికుడు మనస్థాపం చెంది మరణించాడని, మంత్రి హోదాలో ఉన్న ఆయనకు ఇది తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్, అందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజీవరావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు మంత్రి ముందు తమ గోడు వెళ్లబోసుకోగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన మంత్రి దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. సత్యసాయి కార్మికుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని  డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement