ponnala lakshmaih
-
కేసీఆర్ నిజ స్వరూపం బయటపడింది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దొంగ దీక్ష గురించి తనకు ఆరోజే తెలిసినా తెలంగాణ కోసం మాట్లాడలేదని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన పొన్నాల.. దీక్ష చేస్తూ 700 కిలో క్యాలరీల ద్రవాహారాన్ని కేసీఆర్ తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్, పబ్లిక్ మీటిoగ్‌లకే పరిమితమై, ప్రపంచ నియంతలలో మొదటి స్థానాన్ని సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. ఆర్టీసీ నుంచి ప్రభుత్వం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువని ఆయన అన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మంచి సలహాలు కూడా స్వీకరించని కేసీఆర్ రాక్షస, దోపిడీ పాలనకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
మీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టింది!
కాంగ్రెస్ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ సంగారెడ్డి క్రైం : అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏమిటో ఆ పార్టీ నేతలు పొన్నాల, జీవన్‌రెడ్డి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ది తుగ్లక్ పాలన అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జీవన్‌రెడ్డి విమర్శించడాన్ని ఆయన తప్పు బట్టారు. కాంగ్రెస్‌పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ పింఛన్లు ఎందుకు అందజేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం, అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ పాలనకు స్వస్తి చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే కావస్తోందని, ఇంత తక్కువ సమయంలోనే ఏమీ చేయడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరి కాదన్నారు. చీటికిమాటికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు లేనిపోని విమర్శలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందాయన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడం వల్లనే ప్రజలు వైఎస్‌ను మరువలేకపోతున్నారన్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తమ సమస్యలు విన్నవించుకొనేందుకు వచ్చిన సత్యసాయి కార్మికులతో మంత్రి హరీష్రాావు వ్యవహరించిన తీరువల్లేనే సత్యసాయి కార్మికుడు మనస్థాపం చెంది మరణించాడని, మంత్రి హోదాలో ఉన్న ఆయనకు ఇది తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్, అందోల్ నియోజకవర్గ ఇన్చార్జి సంజీవరావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు మంత్రి ముందు తమ గోడు వెళ్లబోసుకోగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన మంత్రి దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. సత్యసాయి కార్మికుల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
సోనియాతో డీఎస్ మంతనాలు, పొన్నాలకు పిలుపు
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్, రెండుసార్లు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డీఎస్ హస్తినలో సోనియా మంతనాలు జరపడం తెలంగాణా కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తేవడంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు డీఎస్ కృషి కూడా ఉంది. దాంతో తన సొంత నియోజక వర్గంలో మూడుసార్లు ఓడిపోయినా డీఎస్‌కు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చింది. అలాగే డీఎస్ ఎమ్మెల్సీ పదవి వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సోనియాను కలిసిన డీఎస్ తనకు మరో దఫా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని లేకుంటే తెలంగాణా పిసిసి పగ్గాలైనా అందించాలని కోరినట్లు సమాచారం. ఇప్పటికే పొన్నాల నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన్ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీలో పలువురు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్ మంతనాలు, పొన్నాలను అధిష్టానం నుంచి పిలుపు రావటం మరోసారి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.