సోనియాతో డీఎస్ మంతనాలు, పొన్నాలకు పిలుపు
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ పిలుపు మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్, రెండుసార్లు పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డీఎస్ హస్తినలో సోనియా మంతనాలు జరపడం తెలంగాణా కాంగ్రెస్లో చర్చకు దారి తీస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండు సార్లు అధికారంలోకి తేవడంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు డీఎస్ కృషి కూడా ఉంది. దాంతో తన సొంత నియోజక వర్గంలో మూడుసార్లు ఓడిపోయినా డీఎస్కు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చింది. అలాగే డీఎస్ ఎమ్మెల్సీ పదవి వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే సోనియాను కలిసిన డీఎస్ తనకు మరో దఫా ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని లేకుంటే తెలంగాణా పిసిసి పగ్గాలైనా అందించాలని కోరినట్లు సమాచారం.
ఇప్పటికే పొన్నాల నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన్ని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పార్టీలో పలువురు నేతలు అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్ మంతనాలు, పొన్నాలను అధిష్టానం నుంచి పిలుపు రావటం మరోసారి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి.