సోనియా జన్మదినం... ప్రత్యేక పూజలు, అర్చనలు
నిజామాబాద్: రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బంగారు తెలంగాణ అప్పగించారని శాసన మండలిలో ఆ పార్టీ నేత డి. శ్రీనివాస్ తెలిపారు. బంగారు తెలంగాణను రత్నాల తెలంగాణగా మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డీఎస్ డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9 సోనియాగాంధీ జన్మదినం. ఈ నేపథ్యంలో నగరంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో సోనియా పేరుతో డి.శ్రీనివాస్ ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. అనంతరం దేవాలయం వెలపల డీఎస్ విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు సోనియా జన్మదినమైన డిసెంబర్ 9, 2009న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విభజన విషయంలో ఎన్నో అడ్డంకులు, విమర్శులు ఎదురైనా... వాటికి ఎదురు నిలిచి సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోనియాగాంధీ పుట్టిన రోజును తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనం జరుపుకుంటున్నారు.