సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. తెరవెనుక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత టీఆర్‌ఎస్‌లో ఉన్న కార్పొరేటర్ కాపర్తి సుజాత తనకు టికెట్ కేటాయించాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల కమిటీకి దరఖాస్తు చేయడం కాంగ్రెస్‌తో పాటు, ఇటు టీఆర్‌ఎస్‌లో కూడా కలకలం రేగింది. గాంధీభవన్‌కు వెళ్లి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సుజాత కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డీఎస్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆమె కూడా కారెక్కారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని టీఆర్‌ఎస్ పార్టీ తీర్మానం చేయడం విదితమే. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు రుజువు చేసి, సస్పెండ్ చేయండి లేదా.. క్షమాపణ చెప్పండని అధినేత కేసీఆర్‌కు డీఎస్ ఘాటు లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల తర్వాత టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న డీఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కాపర్తి సుజాత ఇప్పుడు అర్బన్ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానం టికెట్ కోసం బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణు, ప్రేమలతా అగర్వాల్, నరాల కళ్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు కాపర్తి సుజాత దరఖాస్తు కూడా ఇప్పుడు టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలనలో ఉండటం గమనార్హం.
పోటీ చేయాలని డీఎస్‌పై అనుచరుల ఒత్తిడి..
రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ త్వరలో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి సొంత గూటికి చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని ఆయన అనుచరులు కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అర్బన్‌లో డీఎస్‌తోనే పోటీ చేయించాలని ఆయన అనుచరవర్గం పట్టుబడుతోంది. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన మైనార్టీల్లో డీఎస్‌కు గట్టి పట్టుంది. దీనికి తోడు ఆయన సామాజికవర్గం ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఈ రెండు సామాజికవర్గాల ఓట్లు ఏకపక్షంగా సాధించాలంటే డీఎస్ స్వయంగా బరిలోకి దిగితేనే సాధ్యమవుతుందని డీఎస్ అనుచరవర్గం పేర్కొంటోంది. అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకూ తెరవెనుక అనూహ్య మలుపులు తిరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment