సౌదాగర్, గంగారాంషబ్బీర్‌అలీ, ఈరవత్రి అనిల్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో సర్వే నివేదికలతో పాటు, కొత్త మార్గదర్శకాలు తెరపైకి వస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ మార్గదర్శకాలు అమలైతే ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలైన మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్‌అలీ, సీనియర్ నాయకులు సౌదాగర్ గంగారాం, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ లాంటి వారికే టికెట్ గండం పొంచి ఉంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యక్ష ఎన్నికల్లో మూడు పర్యాయాలు పరాజయం పాలైన నేతల కు టిక్కెట్ ఇవ్వకూడదని, 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి, 25 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినా టిక్కెట్ ఇచ్చేది లేదనే మార్గదర్శ కాలు పక్కాగా అమలు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మార్గదర్శకాలతో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలకే అసెంబ్లీ స్థానాలకు టికెట్ల ముప్పు పొంచిఉంది.
షబ్బీర్‌కే..!
నూతన మార్గదర్శకాలు అమలైతే కామారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైన ఆ పార్టీ మండలి పక్ష నేత షబ్బీర్ అలీకే టిక్కెట్ ప్రశ్నార్థకం కానుంది. షబ్బీర్ ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతిలో పరాజయం చెందారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి చవి చూశారు. ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి 2010లో ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరపున షబ్బీర్‌అలీ పోటీ చేయగా ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో సుమారు 37 వేల పైచిలుకు ఓట్లతో ఘోర పరాజయం పాలయ్యారు. ఇలా మూడు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ షబ్బీర్ అలీ రాష్ట్ర అగ్రనేతల్లో ఒకరిగా ఉన్నారు.
ఏకంగా మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి తోడు కామారెడ్డి నియోజకవర్గంలో ఆయన ఆ పార్టీలో ఎదురులేని నేతగా కొనసాగుతున్నా రు. మూడు పర్యాయాలు ఓటమి పాలైన నేతలకు టిక్కెట్ ఇవ్వద్దనే మార్గదర్శకాలు అమలైతే షబ్బీర్‌కు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారుకావడం, కేవలం అధికారికంగా ప్రకటించాల్సి ఉండటంతో షబ్బీర్‌అలీ ఇప్పటికే ఇక్కడ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సైతం రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గెలుచుకునే స్థానాల్లో కామారెడ్డి ఒకటని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఈ తరుణంలో ఈ నిబంధనను కాంగ్రెస్ అధిష్టానం అమలు చేస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
30 వేల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి..
గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల కంటే ఎక్కువ తేడాతో పరాజయం పాలైన నేతలకు కూడా ఈసారి టికెట్ కట్ చేయాలనే నిబంధన తెరపైకి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందాలంటే కనీసం 60 వేల ఓట్లు తెచ్చుకుంటే విజయం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటిది 30 వేల ఓట్లు ప్రత్యర్థి పార్టీ నుంచి తన వైపునకు తిప్పుకోవడం అనుకున్నంత సులభం కాదని భావిస్తున్న అధిష్టానం ఈ నిబంధనను తెరపైకి తెచ్చిందనే అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. ఈ నిబంధనలు అమలైన పక్షంలో జుక్కల్ టికెట్ రేసులో ఉన్న ఆ పార్టీ సీనియర్‌నేత సౌదాగర్ గంగారాంతో పాటు, ప్రభుత్వ మాజీ విప్, బాల్కొండ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఈరవత్రి అనిల్‌లకు కూడా టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో ఈ ఇద్దరు నేతలు ముందు వరుసలో ఉన్నారు.
2014 ఎన్నికల్లో బాల్కొండ బరిలో దిగిన అనిల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఏకంగా 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అలాగే జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సౌదాగర్ గంగారాం కూడా 35 వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ విజయం సాధించిన టీఆర్‌ఎస్ తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేతిలో పరాజయం పొందారు. 30 వేల ఓట్ల కంటే ఎక్కువ ఓట్లతో ఓటమి పాలైన వారికి టికెట్ ఇవ్వద్దనే నిబంధన అమలైతే గంగారాంతో పాటు, ఈరవత్రి అనిల్‌లకు అభ్యర్థిత్వాలు ప్రశ్నార్థకమే! కాగా నియోజకవర్గంలో గంగారాంకు ఇప్పటికీ గట్టి పట్టుంది. ఈసారి తనకు టికెట్ కేటాయించకపోతే.. తన అల్లుడికైనా ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన గంగారాం.. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా నైనా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది.
అర్బన్ స్థానంలో బొటాబోటీగా..
నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పోటీ చేశారు. కేవలం 25,742 ఓట్లు సాధించిన మహేష్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్‌అలీ రెండో స్థానం లో నిలవగా, బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారా యణగుప్త మూడో స్థానంలో ఉన్నారు. కొత్త మా ర్గదర్శకాల ప్రకారం 25 వేల ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చిన నేతల పేర్లు టిక్కెట్ పరిశీలన జాబితాలో నుంచి తొలగించాలనే నిబంధనల తెరపైకి వచ్చింది. కానీ బొటాబోటీగా 25 వేల కంటే కేవలం 742 ఓట్లు మాత్రమే ఎక్కువ పొందగలిగిన మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఈ మార్గదర్శకాలతో ముప్పులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్ని అంశాలు పరిగణనలోకి..
ఎలాగైనా టీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిత్వాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. మహాకూటమి పొత్తులో సీట్ల పంపకాల విషయంలో గెలిచే పార్టీకే స్థానం కేటాయించాలని అన్ని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపుగుర్రాల వేటలో నిమగ్నమైంది. కాగా కొత్త మార్గదర్శకాలు తెరపైకి రావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మార్గదర్శకాలతో పాటు, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించాలనే అంశం ఇటీవల జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చకొచ్చిందని జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. తెరపైకి వచ్చిన ఈ మార్గదర్శకాలు ఆయా స్థానాల అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఆశావహులకు చుక్కెదురవుతుందా.? లేక మార్గదర్శకాలను అసలు పరిగణనలోకి తీసుకోకుండా వదిలేస్తారా అనేది అభ్యర్థిత్వాల ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment