ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టిక్కెట్టును ఆశిస్తూ ఏకంగా 32 మంది అధిష్టానానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నిర్దేశించిన గడువు శుక్రవారంతో ముగిసింది. అయితే ఆ పార్టీ ఆశావహుల జాబితా చాంతాడంత తయారైంది. తొమ్మిది స్థానాలకు ఏకంగా 32 మంది తమ పేర్లను పరిశీలించాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా డీసీసీ ద్వారా చేసుకున్న దరఖా స్తులే కాకుండా కొందరు నేతలు నేరుగా టీపీసీసీ కి అందజేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు అధికంగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలకు అనుచరులుగా ఉన్న చోటామోటా నేతలు సైతం పార్టీ టికెట్ల కోసం పోటీ పడటం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో పార్టీ సాంప్రదాయం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపడతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ప్రకటించారు. ఆశావహులు ఎవరైనా తమ దరఖాస్తులను జిల్లా కాంగ్రెస్ కమిటీకి అ ప్పగించాలని, ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుందని ఆ పార్టీ ప్రక టించింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైన బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ వంటి నియోజకవర్గాలకు సైతం ద్వితీయ శ్రేణి నాయకులు దరఖాస్తులు పెట్టుకోవడం గమనార్హం. టికెట్ల కోసం తమకు వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే తొలివిడతగా పీసీసీకి అందజేశామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తాహెర్‌బిన్ హందాన్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు.
డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే..
- మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డికి ఖరారు కానున్న బోధన్ స్థానానికి.. ఉప్పు సంతో ష్ కూడా తన దరఖాస్తును పీసీసీ కార్యాలయంలో చివరి రోజు అందజేశారు.
- మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీకి ఖారారు కానున్న కామారెడ్డికి నల్లవెల్లి అశోక్ కూడా తన పేరును పరిశీలించాలని లిఖిత పూర్వకంగా కోరారు.
- ఆర్మూర్ స్థానానికి అకుల లలితతో పాటు, మార చంద్రమోహన్, ఏబీ శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు.
- నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, అర్కల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, భూమారెడ్డి దరఖాస్తులు డీసీసీకి అందాయి.
తొమ్మిది స్థానాలకు 32 దరఖాస్తులు..
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల టికెట్ల కోసం ప్రస్తుతానికి 32 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. డీసీసీకి వచ్చిన వాటితో పాటు, కొందరు నేరుగా టీపీసీసీకి సైతం అందజేశారు. తమకు పరిచయం ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి నేతలను ఆశ్రయించి దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి తెరపైకి వచ్చిన దరఖాస్తుల సంఖ్య 32 కాగా, శనివారం ఈ సంఖ్యపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
ఓ అప్లికేషన్ పెడితే పోలా..!
ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులకు, మాజీ ఎమ్మెల్యేలకు అనుచరులుగా పనిచేసిన నాయకులు ఇప్పుడు ఎన్నికల సమయానికి వచ్చే సరికి తమ నేతలతో సైతం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు సభ్యునికి కూడా పోటీ చేయని నేతలు ఒకరిద్దరు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడం కూడా ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు కూడా కాంగ్రెస్ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
డీసీసీకి అందిన దరఖాస్తులు ఇవే..
- నిజామాబాద్ అర్బన్ స్థానానికి బి.మహేష్‌కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్ హందాన్, నరాల రత్నాకర్, కేశవేణులతో పాటు ఓ ఎన్‌ఆర్‌ఐ నుంచి కూడా దరఖాస్తు వచ్చింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే హరినారాయణ్ కుటుంబానికి చెందిన కళ్యాణ్ అనే ఎన్‌ఆర్‌ఐ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
- బాల్కొండలో ఈరవత్రి అనిల్ దరఖాస్తుతో పాటు, పార్టీ కిసాన్‌కేత్ వైస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మానాల మోహన్‌రెడ్డి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
- బాన్సువాడ స్థానానికి కాసుల బాల్‌రాజుతో పాటు, మల్యాద్రిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకట్‌రాంరెడ్డి, మహిళా నేత సబితలతో పాటు, ఇటీవల టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
- ఎల్లారెడ్డి స్థానానికి నల్లమడుగు సురేందర్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, జమునారాథోడ్, పైల కృష్ణారెడ్డిల దరఖాస్తులు డీసీసీకి అందాయి. జుక్కల్ (ఎస్సీ) స్థానానికి మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, అరుణతార, గడుగు గంగాధర్, తుకారాంలు తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment